కోవిడ్ వేవ్ ప్రారంభం నుంచి పిల్లలు, టీనేజర్లపై మొబైల్ ఫోన్ల ప్రభావం బాగా ఎక్కువైపోయింది. వారి స్క్రీన్ సమయంలో విపరీతంగా పెరుగుతోందని.. తద్వారా మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఎంతోమంది తల్లిదండ్రులు కంగారుపడుతుండటం మనం చూస్తూనే ఉంటాం. అయితే పిల్లలు గానీ, టీనేజర్లు గానీ.. మొబైల్ ఫోన్లలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నరన్నది మీరెప్పుడైనా గమనించారా.? మీరు దానిపై కూడా దృష్టి సారించక తప్పదు..
కామన్ సెన్స్(Common Sense) మీడియా అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 50 శాతం మంది టీనేజర్లు 13 ఏళ్లలోపు ఆన్‌లైన్ పోర్నోగ్రఫీని చూస్తున్నారని వెల్లడించింది. “టీన్స్ అండ్ పోర్నోగ్రఫీ” పేరుతో ఆ సంస్థ విడుదల చేసిన నివేదికలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి. సెప్టెంబర్ 2022లో 13 నుండి 17 సంవత్సరాల వయస్సు ఉన్న సుమారు 1,350 మంది టీనేజర్లపై ఓ సర్వే నిర్వహించారు.
ఇందులో 58 శాతం మంది అనుకోకుండా తాము ఆన్‌లైన్‌లో పోర్న్ చూశామని చెప్పారు. అలాగే ఇలాంటి కంటెంట్ ఇంటర్నెట్‌లో చూడాలనుకోలేదని తెలిపారు. అలాగే 63 శాతం మంది గతవారమే పోర్న్ చూశామని అంగీకరించారు. అటు టీనేజర్లలో 44 శాతం మంది మల్టీప్లేయర్ గేమ్స్ ద్వారా స్నేహితులైన వారి ద్వారా ఆన్‌లైన్ పోర్నగ్రఫీని తెలుసుకున్నామని.. తాము ఉద్దేశపూర్వకంగానే వీక్షించామని చెప్పుకొచ్చారు. ఇక 38 శాతం మంది ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా సైట్‌ల ద్వారా, 44 శాతం మంది డైరెక్ట్‌గా పోర్న్ వెబ్‌సైట్‌లలోకి వెళ్లి వీక్షించగా.. 34 శాతం మంది యూట్యూబ్, 16 శాతం మంది టీనేజర్లు సబ్‌స్క్రిప్షన్ సైట్‌లలో 18 శాతం మంది పోర్న్‌ను ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌లో చూసినట్లు సర్వేలో తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే.. పోర్న్ చూసినవారిలో 50 శాతం మంది తాము సిగ్గుపడుతున్నట్లు అంగీకరించగా.. 67 శాతం మంది యువకులు మాత్రం అలాంటిదేమి లేదని తెలిపారు. ఇక 45 శాతం మంది యువకులు ఆన్‌లైన్ అశ్లీలత సెక్స్ గురించి కొంత సమాచారాన్ని అందించిందని.. 27 శాతం మంది సెక్స్‌ను కచ్చితంగా చూపుతుందని భావిస్తున్నారట.
కాగా, భారత ప్రభుత్వం అశ్లీల సైట్లను నిషేధించిన సంగతి తెలిసిందే. ప్రతీ సందర్భంలోనూ పదుల సంఖ్యలో అలాంటి సైట్లపై బ్యాన్ విధిస్తోంది కేంద్రం. అయితేనేం అవి వేర్వేరు డొమైన్ల ద్వారా మళ్లీ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలు మొబైల్ ఫోన్లలో ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో పర్యవేక్షించడమే కాదు.. వాటికి దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.(Source)