Rahul Gandhi: సుప్రీం కోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో కీలక ఉత్తర్వులు

పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసులో సూరత్‌ కోర్టు ఇచ్చిన శిక్షపై సుప్రీం కోర్టు స్టే విధించింది. పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీకి గరిష్ఠ శిక్ష విధించడంలో సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి కారణ చూపలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటూ సూరత్‌ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది సర్వోన్నత న్యాయస్థానం.

Rahul Gandhi: సుప్రీం కోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట.. పరువు నష్టం కేసులో కీలక ఉత్తర్వులు
Rahul Gandhi

Updated on: Aug 04, 2023 | 2:52 PM

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మోదీ ఇంటి పేరు విషయంలో సూరత్‌ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాహుల్‌ గాంధీకి రెండేళ్ల గరిష్ట శిక్ష ఎందుకు విధిస్తున్నారో సూరత్‌ కోర్టు నిర్ధిష్టంగా పేర్కొనలేదు కాబట్టి ఆ శిక్షపై స్టే విధించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. చట్టప్రకారం ఈ కేసులో అప్పీల్‌ను పరిష్కరించేందుకు ఈ తీర్పు ఎటువంటి ఆటంకం కాబోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు కారణంగానే రాహుల్‌ గాంధీ పై అనర్హత వేటు పడింది. ఆయన ఎంపీ సభ్యత్వం రద్దైంది. రాహుల్‌ గాంధీ తరపున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు విస్తృతంగా ఉన్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిటిషనర్‌ ప్రజాజీవితమే కాదు ఆయనను ఎన్నుకున్న ఓటర్లను ప్రభావితం చేస్తుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

మరో వైపు ప్రజాజీవితంలో ఉన్నవారు తన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. 2019 ఎన్నికల సమయంలో కర్నాటక రాష్ట్రంలోని కోలార్‌ నియోజకవర్గంలో చేసిన వ్యాఖ్యలు రాహుల్‌ గాంధీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ – ఈ దొంగలందరికీ ఒకటే ఇంటి పేరు ఉందేంటని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. దీన్ని తప్పుబడుతూ గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ సూరత్‌ కోర్టులో రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా పరువు నష్టం కేసు వేశారు. ఉద్దేశపూర్వకంగానే మోదీ అనే ఇంటి పేరు కలిగిన వారిని రాహుల్ గాంధీ అవమానించారని సూరత్‌ కోర్టు అభిప్రాయపడుతూ ఈ కేసులో గరిష్ఠంగా ఉన్న రెండేళ్ల జైలు శిక్షను విధించింది. తన 168 పేజీల తీర్పులో జడ్జి హదిరాష్ వర్మ అనేక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌ సభ్యుడు కాబట్టి ఆయన చేసే వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తన తీర్పులో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..