
చంఢీగఢ్ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రిటర్నింగ్ అధికారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, ఇలాంటి పనులను చూస్తూ ఊరుకోబోమన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్. ఎన్నికలకు సంబంధించి అన్ని రికార్డులను భద్రపరచాలని ఆదేశించారు.
చండీగఢ్ మేయర్ ఎన్నిక నిర్వహణ తీరును తప్పపట్టింది సుప్రీంకోర్టు. ఎన్నికల ప్రక్రియ వీడియోను చూశాక, రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను ఖరాబ్ చేసినట్లు గుర్తించింది సుప్రీం కోర్టు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఇలాంటి పనులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్. బ్యాలెట్ పత్రాలు, వీడియో, ఇతర సామగ్రి సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అన్ని రికార్డులను భద్రపరచాలని పంజాబ్- హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.
మేయర్ ఎన్నికలో అక్రమాలు జరిగాయని.. ఎన్నికను రద్దు చేసి, మళ్లీ పోలింగ్ జరపాలని కోరుతూ అమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ మొదట పంజాబ్- హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించడంతో, హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీజేఐ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తదుపరి విచారణ చేపట్టే వరకు చండీగఢ్ కార్పొరేషన్ సమావేశాన్ని వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ వ్యవహారంపై చండీగఢ్ అధికారులకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్ట్.
మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం ఉన్నప్పటికీ ఆప్- కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ ఓడిపోయారు. ఎన్నికల అధికారి బ్యాలెట్ పత్రాలపై పెన్నుతో రాసి.. తమ ఓట్లను చెల్లకుండా చేశారని కాంగ్రెస్, ఆప్‌లు ఆరోపించాయి. దీనిపై వీడియో చూశాక సుప్రీం సీరియస్ అయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…