పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో నెలకొన్న ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 27 మంది చనిపోగా.. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఆదివారం నుంచి నెలకొన్న హింసపై.. ప్రతిపక్షాలు కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు సినీ ప్రముఖులు కూడా ఈ ఘటనపై కేంద్రం ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా స్పందించారు.
ఢిల్లీ అల్లర్లకు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డాడు. నేను బీజేపీకి మద్దతు దారుడిని కాదని.. బీజేపీని వెనకేసుకు వచ్చే ఆలోచన తనకు లేదన్నారు రజినీకాంత్. సీఏఏ ద్వారా ముస్లింలకు నష్టం కలిగితే.. వారి పక్షాన పోరాడతానని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఘర్షణల విషయంలో కేంద్ర నిఘా సంస్థలు వైఫల్యమయ్యాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి.. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులను అరికట్టాలని.. ఆందోళనలను అదుపుచేయలేనప్పుడు.. ప్రభుత్వం నుంచి తప్పుకోవడం మంచిదన్నారు. కులం, మతం పేరు మీద రాజకీయాలు చేయడం దురదృష్టకరమని సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నారు.