2020-2021 వార్షిక బడ్జెట్ దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. తొలుత బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కాగానే స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్న సంకేతాలు కనిపించాయి. ఆ తర్వాత క్రమంగా బడ్జెట్ వివరాలు వెల్లడవుతున్న తరుణంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఏకంగా బీఎస్ఈ 700 పాయింట్లు పడిపోయింది.
ఒకవైపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం ప్రారంభం కాగానే దేశీయ స్టాక్ మార్కెట్లలో దూకుడు మొదలైంది. వివిధ శాఖలకు కేటాయింపులు ప్రకటిస్తుండగా స్టాక్ మార్కెట్లలో వేగం పెరిగింది. ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు ఇన్వెస్టర్లకు ఊతమిచ్చినట్లుగా విఫుణులు భావించారు.
అంతకు ముందు ఇవాళ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ ఉదయం మార్కెట్ సూచీలు నష్టాలలో ప్రారంభమయ్యాయి. ఉదయం పదకొండు గంటలకు నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే స్టాక్ మార్కెట్లో కదలికలు మొదలయ్యాయి. ఆ తర్వాత కేటాయింపులు.. వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు, ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు వివరిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లలో దూకుడు మొదలైంది.
ప్రస్తుతం బిఎస్ఈ సెన్సెక్స్ 50 పాయింట్లు లాభంలో ట్రేడ్ అయ్యింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలుంటాయని ఆర్థిక మంత్రి ప్రకటించడం స్టాక్ మార్కెట్లకు ఊతమిస్తోందని అంఛనా వేశారు. అయితే.. ఆ తర్వాత వివిధ రంగాలకు కేటాయింపులు వెల్లడిస్తున్న తరుణంలో స్టాక్ మార్కెట్లపై ప్రతికూలత మొదలైంది. అది బడ్జెట్ ప్రసంగం ముగిసే దాకా కొనసాగింది. మొత్తమ్మీద రెండు గంటల 45 నిమిషాల పాటు జరిగిన నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం తర్వాత స్టాక్ మార్కెట్లు ఘోరంగా పడిపోయాయి.