Srinivasa Gowda: మట్టిలో మాణిక్యం మరోసారి మెరిసింది.. ఉసేన్ బోల్ట్‌ను దాటి ఎగసింది… వారెవ్వా, శ్రీనివాసగౌడ

|

Mar 30, 2021 | 9:03 AM

మామూలుగా శ్రీనివాసగౌడ..అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు..కానీ కంబాళ వీరుడు శ్రీనివాసగౌడ అంటే మాత్రం టక్కున గుర్తుకు వచ్చే పేరు..జ్ఞప్తి చేసుకునే పేరు.

Srinivasa Gowda: మట్టిలో మాణిక్యం మరోసారి మెరిసింది.. ఉసేన్ బోల్ట్‌ను దాటి ఎగసింది... వారెవ్వా, శ్రీనివాసగౌడ
Sriniwas Gowda
Follow us on

మామూలుగా శ్రీనివాసగౌడ..అంటే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు..కానీ కంబాళ వీరుడు శ్రీనివాసగౌడ అంటే మాత్రం టక్కున గుర్తుకు వచ్చే పేరు..జ్ఞప్తి చేసుకునే పేరు. దున్నలతో పోటీపడుతూ…రాకెట్ వేగంతో దూసుకుపోయే కంబాళ పోటీల్లో ఇతగాడు దేశం మెచ్చిన మొనగాడు..మట్టిలో పుట్టిన పరుగువీరుడు.

లేటెస్ట్ ముచ్చట ఏంటంటే.. గతంలో సృష్టించిన రికార్డునే ఇంకాస్త పాలిష్‌ పెట్టి..ఇంకాస్త మెరుగులు అద్దాడు. గతేడాది కంబాళ పోటీల్లో 142.4 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో పూర్తిచేశాడు. అంటే 100మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలో పూర్తి చేసినట్టు లెక్క. ఇక తాజాగా జరిగిన పోటీల్లో 100మీటర్ల దూరాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తి చేసి తన రికార్డును తానే తిరగరాశాడు.

శ్రీనివాస గౌడ గతేడాది జరిగిన పోటీల్లో జమైకా పరుగుల చిరుత ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల ప్రపంచ రికార్డు 9.58 సెకన్లు బ్రేక్ చేయగా, తాజాగా జరిగిన పోటీల్లో ఊహకు అందని స్పీడ్‌లో 100 మీటర్ల పరుగును పూర్తి చేసి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్శించాడు. ఇటీవల కర్ణాటకలోని బంత్వాల్‌ తాలూకా పరిధిలో నిర్వహించిన 125 మీటర్ల పరుగు పోటీలో పాల్గొన్న శ్రీనివాస గౌడ.. 11.21 సెకన్లలోనే టార్గెట్ ఛేదించాడు. ఈ పోటీని 100 మీటర్లకు లెక్కకడితే అతను లక్ష్యాన్ని కేవలం 8.78 సెకన్లలోనే పూర్తిచేసినట్లు అధికారులు ధృవీకరించారు. గతవారం వెళ్తాంగండి పరిధిలో నిర్వహించిన కంబళ పోటీల్లో 100 మీటర్ల రేసును 8.96 సెకన్లలో పూర్తి చేసిన ఆయన.. వారం తిరగక ముందే తాను నెలకొల్పిన రికార్డును తానే బద్దలుకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు.

కంబాళ అనేది దక్షిణ కన్నడ, ఉడిపి, తుళునాడు తీర ప్రాంతాల్లో ప్రతి ఏడాది నిర్వహించే ఒక సాంప్రదాయ క్రీడ. కంబాళ ఆటలో ఎద్దులను ఉసికొల్పుతూ పోటీదారుడు బురద నీటిలో పరుగెత్తాల్సి ఉంటుంది. ఎవరైతే ఎద్దులను వేగంగా పరిగెత్తించి లక్ష్యాన్ని చేరుకుంటారో వారిని విజేతగా ప్రకటిస్తారు. కర్ణాటకలో వ్యవసాయం చేసే గౌడ సామాజిక వర్గం వారు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీల్లో ఆరితేరిన మొనగాడు శ్రీనివాసగౌడ. గౌడ టాలెంట్‌కు సాయ్ ఫిదా అయింది. ఒలంపిక్స్‌కు సిద్ధం చేస్తాం రావయ్యా బాబూ అన్నా శ్రీనివాసగౌడ సున్నితంగా రిజెక్ట్ చేశాడు. ఏమైనా మనోడి పరుగుకు మాత్రం యావత్ దేశం సలాం చేస్తోంది.

Also Read: వీళ్లు మామూలు పిల్లలు కాదు..జగత్‌ జంత్రీలు.. సైకిల్ కనిపిస్తే వదలరు…

ఆపరేషన్ సమయంలో డాక్టర్లు నీలం లేదా ఆకుపచ్చ దుస్తులను ఎందుకు ధరిస్తారు? దీని వెనుక కారణం ఇదే