
ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం, మానవ విలువల ప్రచారానికి విశేష కృషి చేసిన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్‌కు ప్రతిష్టాత్మకమైన లక్సెంబర్గ్ పీస్ ప్రైజ్ దక్కింది. శాంతి కార్యకర్తలు, పండితులు, విధాన రూపకర్తల అంతర్జాతీయ వేదిక అయిన వరల్డ్ పీస్ ఫోరం ఈ అవార్డును ప్రకటించింది. గత 45 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, సంఘర్షణల పరిష్కారం, మానసిక క్షోభ నివారణ, మానవ విలువల ప్రోత్సాహానికి ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవాన్ని అందించారు.
ముఖ్యంగా 182 దేశాలలో కోట్లాది మందిని శాంతి దూతలుగా మారేందుకు ప్రేరేపించడం, హింస ప్రభావిత ప్రాంతాల్లో సయోధ్యకు కృషి చేయడం, ఒత్తిడి నివారణ కార్యక్రమాలు నిర్వహించడం వంటి అంశాలు ఈ పురస్కారానికి ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీశ్రీ రవిశంకర్.. ప్రపంచంలో నెలకొనే అనేక సంఘర్షణలకు మూల కారణం వ్యక్తుల అంతర్గత అశాంతేనని అన్నారు. సమాజంలో విభేదాలు పెరుగుతున్న ఈ కాలంలో యువత వారధులుగా మారి సంభాషణలను పునరుద్ధరించాలని, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. శాంతి అంటే నిష్క్రియాత్మకత కాదు. అలాగే దూకుడు అంటే ధైర్యం కూడా కాదు. చైతన్యవంతమైన, బాధ్యతాయుతమైన జీవన విధానమే నిజమైన శాంతికి దారి తీస్తుంది అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒత్తిడి ఒకటని ఆయన అభిప్రాయపడ్డారు. ఒత్తిడి లేని మనస్సు, హింస లేని సమాజం శాశ్వత శాంతికి పునాది అని అన్నారు. భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, శాంతి నిర్మాణానికి కూడా అంతే స్థాయిలో వనరులు, శ్రద్ధ కేటాయించాలని శ్రీశ్రీ రవి శంకర్ సూచించారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన శ్రీశ్రీ రవిశంకర్ ప్రపంచవ్యాప్తంగా విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, ఒత్తిడి నివారణ, యువజన సాధికారత రంగాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు వందల మిలియన్ల మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపినట్లు సంస్థ పేర్కొంటోంది. ప్రపంచ శాంతి, సయోధ్య, మానవ గౌరవ పరిరక్షణకు విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే లక్సెంబర్గ్ శాంతి బహుమతి, అంతర్జాతీయ స్థాయిలో అత్యంత గౌరవనీయమైన పురస్కారాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ అవార్డు ద్వారా గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ చేసిన శాంతి సేవలకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.