నవరాత్రుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..! మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక కసరత్తు..

దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోందా? చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియకు లైన్ క్లియర్ చేసేందుకు మోదీ సర్కార్ సరికొత్త వ్యూహం రచిస్తోందా? వర్షాకాల సమావేశాలు ముగిసినా సెషన్‌ను ప్రోరోగ్ చేయకపోవడం వెనుక ఉన్న అసలు మర్మమేంటి? నవరాత్రుల వేళ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల దిశగా ఢిల్లీలో సాగుతున్న కీలక పరిణామాల గురించి తెలుసుకుందాం..

నవరాత్రుల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు..! మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం కీలక కసరత్తు..
Special Parliament Session During Navratri

Edited By:

Updated on: Sep 13, 2026 | 1:49 PM

మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 తో నిరవధికంగా వాయిదా పడినా మాన్సూన్ సెషన్‌ను ఇంకా ప్రోరోగ్ చేయలేదు. ఒకవేళ ప్రత్యేక సెషన్ ఏర్పాటు చేస్తే నవరాత్రి సమయంలోనే నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచించాయి. దుర్గాదేవి ఆరాధన, మహిళా సాధికారతకు ప్రతీకగా నవరాత్రిని ఎంచుకోవచ్చని అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు రెండూ 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగం. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే లక్ష్యంతో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీని అమలు డీలిమిటేషన్ ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపడి ఉంది.

పార్లమెంట్లో ఎన్డీఏ కి పెరుగుతున్న మద్దతు
ఏప్రిల్‌లో జరిగిన మూడు రోజుల ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లు లోక్‌సభలో రెండు-మూడవ వంతు ప్రత్యేక మెజారిటీ సాధించలేకపోయింది. అప్పట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు రెండు సభల్లోనూ అవసరమైన సంఖ్య లేదు. ఈ బిల్లు ఆమోదానికి లోక్‌సభలో 360 మంది, రాజ్యసభలో 164 మంది ఎంపీలు అవసరం. మేలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలడంతో బీజేపీ స్థానం బలపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కాంగ్రెస్‌తో విభేదాలు తలెత్తడంతో డీఎంకేకు చెందిన 22 లోక్‌సభ ఎంపీల మద్దతు పొందే అవకాశాలను కూడా బీజేపీ పరిశీలిస్తోంది. అయితే తమిళనాడులో డీలిమిటేషన్ చాలా సున్నితమైన అంశంగా ఉంది. ఎన్నికల ప్రచారంలోనే డీఎంకే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. కాబట్టి స్టాలిన్ పార్టీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తుందా అనేది ఇంకా ప్రశ్నార్ధకంగా ఉంది.

మరోవైపు బెంగాల్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ బలం పుంజుకుంది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ వర్గం, టీఎంసీ రెబల్ వర్గం ఎన్డీఏ కి మద్దతు ఇస్తున్నాయి. రాజ్యసభలో ఆప్ చీలిక వర్గం, టీఎంసీ చీలిక వర్గం ఎన్డీఏకి మద్దతు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైన మెజారిటీ తర్వాత ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాల ఆందోళనతో ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కేంద్రం చేయలేదు. అయితే 2027 లో పంజాబ్, గోవా,మణిపూర్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్,హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు దక్కేలా చూడాలని ప్రభుత్వం భావిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us