Congress Emergency Meeting: కాంగ్రెస్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావడానికి అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) శనివారం మధ్యాహ్నం పార్టీ ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. 10 జనపథ్‌లోని సోనియా గాంధీ ఇంట్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) హాజరు కాలేదు. అయితే, ఈ సమావేశానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(Prashant Kishor).. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ(Rahul Gandhi), కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. దీంతో ఆయన పార్టీలో చేరతారని మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, మల్లికార్జున్ ఖర్గే, ఏకే ఆంటోనీ, అంబికా సోనీ, జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్ వంటి సీనియర్ నేతలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పనితీరు నానాటికీ దిగజారుతోంది. గత నెలలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీ అన్ని చోట్లా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. పార్టీ కోల్పోయిన ఆదరణను పునరుద్ధరించేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు ఈ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ని కూడా ఈ భేటీకి పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్ద ఎత్తున పార్టీలో మార్పుల చర్చ కూడా ఊపందుకుంది. అంతే కాదు త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఆ పార్టీ దృష్టి ఉంది. పార్టీని బలోపేతం చేసి ఇక్కడ మెరుగైన పనితీరు కనబరచాలన్నారు. దీంతో పాటు 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు కూడా బీజేపీకి పోటీ ఇచ్చేలా సన్నాహాలు ప్రారంభించాలని ఆ పార్టీ భావిస్తోంది.
ఇదిలా ఉంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. త్వరలో ఆయనకు పార్టీ సభ్యత్వం ఇవ్వవచ్చు. పార్టీ కూడా ఆయనకు పెద్ద బాధ్యతను అప్పగించవచ్చని తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్‌తో పార్టీ శ్రేణులు చాలా కాలంగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హైకమాండ్‌కి ప్రశాంత్ పలు సూచనలు చేశారు. మరోవైపు.. పార్టీలో సీనియర్ నేతలను అసంతృప్తికి గురిచేయకుండా మార్పులు తీసుకురావాలని గాంధీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రశాంత్ ఆలోచన మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్లు సమాచారం. ఇంతకీ ఆయన పార్టీలో చేరతారా, సలహాదారుగా ఉంటారా అనేది కొద్ది రోజుల్లో తేలనుంది.
గత ఏడాది కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రశాంత్ కిశోర్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత కిశోర్ కాంగ్రెస్, రాహుల్ గాంధీపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. అయితే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత.. మరోసారి వారు కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పార్టీలో కీలకంగా వ్యవహరించాలని ప్రశాంత్ కోరుకుంటుండగా.. తమ నిర్ణయాలతో సీనియర్లు ఇబ్బంది పడకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలా ఎవరి వైఖరికి వారు కట్టుబడి ఉంటే.. ఈసారి కూడా వారు కలిసి ముందుకు సాగే అవకాశం కార్యరూపం దాల్చకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
Read Also…. Chiranjeevi : ఆంజనేయుడు పై ప్రేమను చాటుకున్న రామ్ చరణ్.. వీడియో షేర్ చేసిన చిరు