
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించిన వేళ రాజకీయ సవాళ్లు, ప్రతిసవాళ్లు మొదలయ్యాయి. రాహుల్ గాంధీకి ఆత్మవిశ్వాసం ఉంటే మరోసారి అమేఠీ నుంచే పోటీ చేయాలని ఆ ప్రాంత ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఒకప్పుడు నెహ్రూ-గాంధీ కుటుంబానికి అమేఠీ, రాయ్‌బరేలీ ప్రాంతాలు కంచుకోటగా నిలిచాయి. యావత్ రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినా సరే.. ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యులు వరుసగా గెలుస్తూ వచ్చారు. ఆ రికార్డుకు 2019లో స్మృతి ఇరానీ బ్రేకులు వేశారు. ఆ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ తొలిసారి ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది. రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ ఒక్కరే గెలుపొందారు. ఈ ఓటమిని ముందే ఊహించారో లేక.. దక్షిణాదిన పార్టీకి ఊపు తేవాలన్న వ్యూహంలో భాగంగానో కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేసి గెలుపొందడంతో కొంత పరువు నిలుపుకున్నారు. ఇది జరిగి ఐదేళ్లు గడిచిపోయాయి. రాయ్‌బరేలీ నుంచి బరిలోకి దిగాల్సిన సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి పెద్దల సభకు వెళ్లారు. ఆ స్థానంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తారా లేక ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. కానీ గాంధీ-నెహ్రూ కుటుంబ సొంత నియోజకవర్గాల్లో ఒకటైన అమేఠీ గురించి మాత్రం ఎక్కడా చర్చ జరగడం లేదు. అంటే రాహుల్ గాంధీ మరోసారి వాయనాడ్ నుంచే పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ఉత్తర్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించింది. తమకు పట్టున్న అమేఠీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల మీదుగా సాగుతూ నేడు రాష్ట్ర రాజధాని లక్నోకు చేరుకోనుంది. సరిగ్గా ఇదే సమయంలో అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ నుంచి రాహుల్ గాంధీకి సవాల్ ఎదురైంది. “2019లో రాహుల్ అమేఠీని వదిలేశారు. ఈ రోజు అమేఠీ రాహుల్ గాంధీని వదిలేసింది. ఆయనకు ఆత్మవిశ్వాసం ఉంటే.. వాయనాడ్ వదిలి అమేఠీ నుంచే పోటీ చేయాలి” అంటూ స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ఆమె ఈ వ్యాఖ్యలు మరెక్కడో ఉండి చేయలేదు. ‘జన్ సంవాద్’ పేరుతో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా అమేఠీ నుంచే ఆమె ఈ సవాల్ విసిరారు.
దేశ రాజకీయాల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఒక నానుడి ఉంది. ఢిల్లీని గెలవాలంటే ముందు యూపీని గెలవాలని అంటుంటారు. మొత్తం 543 పార్లమెంట్ స్థానాల్లో అత్యధికంగా 80 సీట్లున్న ఉత్తర్ ప్రదేశ్ కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. అలాంటి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాల క్రితం నుంచే తన పట్టు, ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. అక్కడ సమాజ్‌వాదీ పార్టీ (SP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP) వంటి ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) వంటి ఉప ప్రాంతీయ పార్టీలతో కూడా పోటీపడి స్థానాలు సంపాదించలేని స్థితిలోకి చేరుకుంది. చివరకు తమ కంచుకోటలకు కూడా బీటలు పడ్డాయి. రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఏకంగా ప్రియాంక గాంధీకే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కంచుకోటల్లో ఎవరు పోటీ చేస్తారన్న విషయంపై కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. సీట్ల సర్దుబాటుపై కదలిక లేకపోవడం, కనీసం కసరత్తు మొదలవకపోవడంతో తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధపడ్డాయి. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ సైతం అల్టిమేటం జారీ చేసింది. సీట్ల సర్దుబాటుపై తేల్చకపోతే భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాము పాల్గొనబోమంటూ అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఎన్నికల కసరత్తు, మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పక్కనపెట్టిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు అమేఠీలో పోటీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విసిరిన సవాలుకైనా జవాబు ఉంటుందా అన్నదే ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది.