
సిక్కిం, ఆగస్ట్ 15: వృద్ధ తల్లిదండ్రుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కుమారులు, కుమార్తెలను సిక్కిం ప్రభుత్వం అవార్డుతో సత్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో 77వ స్వాంతంత్ర దినోత్సవం వేడుకలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 199 మందిని ఎంపిక చేసింది. వీరందరికీ శుక్రవారం ‘శ్రవణ్ కుమార్’ పేరిట అవార్డులు ప్రదానం చేయనుంది. అలాగే ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి కూడా అందజేయనున్నట్లు సిక్కీం రాష్ట్ర ముఖ్యమంత్రి తమంగ్ తెలిపారు.
ఈ రోజు పాల్జోర్ స్టేడియంలో కుటుంబ విలువలు, బంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను ప్రవేశపెట్టింది. కలతపెట్టే ఆధునిక వాస్తవికతను సమర్ధవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కొంతమంది తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో వదిలివేస్తున్నారని, ఇది సిక్కిం రాష్ట్ర నైతికతకు విరుద్ధమైన ఆచారమని ఆయన అన్నారు. తల్లిదండ్రులను గౌరవించడంలో, వారి పట్ల శ్రద్ధ వహించడంలో విఫలమైతే మన విలువలను కోల్పోవడమం మాత్రమే కాదు. సమాజపరంగా మన గుర్తింపును కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.
మన పురాణాల్లో అంధ తల్లిదండ్రులకు అచంచల సేవ చేసిన శ్రావణ్ కుమార్ గురించి ఈ సందర్భంగా సీఎం తమంగ్ గుర్తుచేశారు. అందుకే శ్రావణ్ కుమార్ పేరటి అవార్డును ప్రతి యేట స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తామన్నారు. ఈ అవార్డుకు నోడల్ ఏజెన్సీగా గ్రామీణాభివృద్ధి శాఖ వ్యవహరిస్తుంది. గ్రామసభ స్థాయిలో ఒక్కొక్కరి చొప్పున ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా ధృవీకరణ కమిటీ నామినేషన్లను పరిశీలిస్తుంది. అవసరమైతే నేపథ్య తనిఖీలు నిర్వహిస్తుంది. తల్లిదండ్రుల పట్ల నిరంతర సంరక్షణ, వ్యక్తిగత త్యాగం, నైతిక ప్రవర్తన, వారి గౌరవం, శ్రేయస్సు పట్ల నిబద్ధత కనబరచిన అభ్యర్థులను అంచనా వేసి, ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ పథకం ఉద్దేశం మానవ విలువను పునరుద్ధరించడం మాత్రమేకాదని సమాజంలో భావోద్వేగ, సాంస్కృతిక పునాదులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఏర్పాటు చేశామన్నారు. నిజమైన పురోగతి మన పెద్దలతో కలిసి నడవడం, వారి జ్ఞానాన్ని గౌరవించడం, వారు ఒకప్పుడు మనల్ని చూసుకున్నట్లుగా వారిని చూసుకోవడంలోనే ఉందని ముఖ్యమంత్రి తమంగ్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.