సిక్కిం రాష్ట్రానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. కొన్ని సంవత్సరాల నుంచి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులు అన్ని తిరిగేది. రుతక్రమంలో ఏదో ఇబ్బంది ఉంది.. గ్యాస్ వల్ల అని.. ఇన్‌ఫెక్షన్ వల్ల అంటూ డాక్టర్లు ఆమెకు టెంపరరీగా మెడిసిన్ ఇచ్చేవారు. ఆ మందులు వేసుకుంటే ఆ పూటకు ఉపశమనం లభించేంది. అయితే కడుపు నొప్పి తీవ్రత పెరగడంతో.. అక్టోబర్ 8న ఆమె సర్ తుటుబ్ నమ్‌గ్యల్ మెమోరియల్(STNM) ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. అక్కడ బాధిత మహిళకు స్కానింగ్ చేసిన వైద్యులు రిపోర్ట్ చూసి స్టన్ అయ్యారు. ఆ మహిళ పొత్తి కడుపులో కత్తెర ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే సర్జరీ నిర్వహించి మహిళ కడుపు నుంచి కత్తెరను తొలగించారు.
అయితే బాధిత మహిళకు 12 ఏళ్ల క్రితం అపెండిక్స్ నొప్పి వచ్చింది. అప్పుడు అదే STNM ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు ఆపరేషన్ చేశారు. సర్జరీ అయిపోయాక ఆమె పొత్తి కడుపులోనే కత్తెర మరిచి కుట్లు వేశారు. ఇక అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె కడుపు నొప్పితో సతమతమవుతూనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఆ కత్తెరను తొలగించారు వైద్యులు. ప్రస్తుతం బాధిత మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. “అపెండిక్స్ ఆపరేషన్ సమయంలో మహిళ కడుపులో కత్తెర విడిచిపెట్టిన కేసును పరిశోధించడానికి ఆరోగ్య శాఖ అధికారులు, STNM వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసాము” అని STNM హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ సురేష్ మదన్ రాయ్ తెలిపారు.
2012లో సర్జరీ జరిగినప్పటి నుండి ఆమె నొప్పిని భరించిందని, కొన్నేళ్లుగా వైద్యులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ, కారణాన్ని ఎవరూ గుర్తించలేకపోయారని మహిళ భర్త చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..