హథ్రాస్‌ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు

|

Oct 02, 2020 | 10:45 AM

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ హత్యాచార ఘటనపై ఆసేతుహిమాచలం భగ్గుమంటోంది... సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.. నిరనసలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి.. అలహాబాద్‌ హైకోర్టు సైతం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

హథ్రాస్‌ ఘటనను సుమోటో కేసుగా స్వీకరించిన అలహాబాద్‌ హైకోర్టు
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్‌ హత్యాచార ఘటనపై ఆసేతుహిమాచలం భగ్గుమంటోంది… సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.. నిరనసలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి.. అలహాబాద్‌ హైకోర్టు సైతం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది.. బాధితురాలిపై అత్యాచారం.. ఆపై అర్థరాత్రి దాటిన దర్వాత అంత్యక్రియలు నిర్వహించడాన్ని అలహాబాద్‌ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది.. బాధితురాలితో పాటు, ఆమె కుటుంబసభ్యుల హక్కులను పోలీసులు, స్థానిక అధికారులు కాలరాసినట్టు తమకు తెలిసిందని హైకోర్టు పేర్కొంది.. హథ్రాస్‌ అత్యాచారఘటన , ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను సుమోటో కేసుగా స్వీకరిస్తున్నామని అలహాబాద్‌ హైకోర్టు ప్రకటించింది. కేసు విచారణను సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ రాజన్‌రాయ్‌, జస్‌ప్రీత్‌ సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం చేపట్టనుంది..
ఇందులో భాగంగానే స్థానిక పోలీసు అధికారులతో పాటు, బాలిక అంత్యక్రియలు నిర్వహించిన ప్రతీ ఒక్కరు ఈ నెల 12లోపు తమ ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. ఈ దారుణ సంఘటనతో సంబంధమున్న ఉన్నతాధికాలకు కూడా నోటీసులు పంపించింది కోర్టు. 19 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం అత్యంత హేయమైన చర్యగా కోర్టు భావించింది.. బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించడంపై కోర్టు సీరియస్సయ్యింది.. ఇది కుటుంబసభ్యుల ప్రాథమిక హక్కులను హరించినట్టుగానే భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ సంఘటనలో బలమైన వ్యక్తుల ప్రయేయం ఉన్నట్లు కోర్టు అనుమానించింది.. పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతపరుస్తామని ధర్మాసనం తెలిపింది. చనిపోయినవారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు వారి హక్కు అని కోర్టు వెల్లడించింది.. ఈ సందర్భంగా పర్మానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, రాంజీ సింగ్ ముజీబ్ భాయి వర్సెస్ యూపీ ప్రభుత్వం, ప్రదీప్ గాంధీ వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసులను ప్రస్తావించింది.

మరోవైపు బాధిత యువతిపై అత్యాచారం జరగలేదని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ప్రకటించడం పలు అనుమానాలకు తావిస్తోంది.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదికలో అమ్మాయిపై రేప్‌ జరగలేదని స్పష్టమయ్యిందని ఉత్తరప్రదేశ్‌ ఏడీజీ ప్రశాంక్‌ కుమార్‌ చెప్పడంతో వివాదం మరింత ముదిరింది.. మెడపై తీవ్రస్థాయి గాయం అవ్వడం వల్లే ఆమె చనిపోయిందని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసుల మాటలు పుండుమీద కారం చల్లె విధంగా ఉన్నాయి.. అత్యాచారానికి ఒడిగట్టిన వారిని కాపాడేందుకు యోగి ఆదిత్యానాథ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. సందీప్‌, రాము, లవ్‌కుశ్‌, రవి అనే నలుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి వాంగూల్మం ఇచ్చినట్టు ఇంతకు మునుపు ఎస్పీ విక్రాంత్‌ వీర్‌ వెల్లడించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.. ఇదిలా ఉంటే బాలిక కుటుంబసభ్యులను పోలీసులు టార్చెర్‌ పెడుతున్నారట! స్టేట్‌మెంట్‌ను మార్చుకోమని ఒత్తిడి తెస్తున్నారట! బాలిక తండ్రిని, కుటుంబసభ్యులను పోలీస్‌ స్టేషన్‌కు బలవంతంగా తీసుకువెళ్లి కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారట! ఇలాగని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు..