సీఏఏకి నిరసనగా ఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్ద ధర్నా చేస్తున్న వందలాది మహిళలు, యువకులు, వృధ్ధులు ఆదివారం హోం మంత్రి అమిత్ షా నివాసానికి బయలుదేరారు. ఈ చట్టంపై ఆయనతో చర్చించి.. దీన్ని ఉపసంహరించుకునేలా నిర్దిష్ట హామీని పొందేందుకు వారంతా పెద్ద సంఖ్యలో బయలుదేరారు. అయితే వీరికి అపాయింట్‌మెంట్ ఇస్తామన్న భరోసా లభించడంతో..మధ్యలోనే వెనుదిరిగారు. కానీ కొందరు ఈ భరోసా మాటలను విశ్వసించక ముందుకు చొచ్ఛుకు రావడంతో… అమిత్ షా ఇంటికి 500 మీటర్ల దూరంలోనే పోలీసులు వీరిని ఆపి వేశారు. అపాయింట్‌మెంట్ కోసం మీ వినతిపత్రాన్ని అమిత్ షా కార్యాలయానికి పంపామని, మీలో కొందరు మహిళలతో కూడిన ప్రతినిధిబృందాన్ని మాత్రమే తాము అనుమతిస్తామని ఖాకీలు స్పష్టం చేశారు. కానీ… తామంతా అక్కడికి వెళ్లి తీరాల్సిందేనని, ఎన్నార్సీ, సీఏఏలను అమలు చేయబోమన్న హామీని అమిత్ షా నుంచి లిఖితపూర్వకంగా కోరుతామని ఆందోళనకారులు వాదించారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ఖాకీలకు తోచలేదు.
ఈ చట్టాలపై ఎవరికైనా అనుమానాలుంటే మూడు రోజుల్లోగా తన కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ కోరవచ్ఛునని, వారితో తాను మాట్లాడతానని షా ఇటీవల ప్రకటించారు. దీంతో షాహీన్‌బాగ్ ఆందోళనకారులు ఆయన నివాసానికి వెళ్లేందుకు నడుం కట్టారు. ఏమైనా.. అమిత్ షా నివాసానికి కూతవేటు దూరంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.