అరుణాచల్ ప్రదేశ్ లోని ఈస్ట్ సియాంగ్ జిల్లా జైలు నుంచి ఏడుగురు ఖైదీలు ఆదివారం సాయంత్రం తప్పించుకుని పారిపోయారు. వీరు జైలు గార్డుల కళ్ళలో కారం, ఉప్పు, పెప్పర్ కొట్టి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం ఖైదీలను సప్పర్ (అల్పాహారం) కోసం వారి సెల్స్ నుంచి బయటకు తీసుకువస్తుండగా.. ఈ ఏడుగురు హఠాత్తుగా గార్డులపై దాడి చేశారని, వారి కళ్ళు, ముక్కు, ముఖాలపై కారం, ఉప్పు, పెప్పర్ కొట్టి పరారయ్యారని అదనపు డీజీపీ రవీంద్ర సింగ్ యాదవ్ తెలిపారు. ఈ జైల్లో సుమారు 94 మంది ఖైదీలు ఉన్నారు. పారిపోయిన వారిని గుర్తించినట్టు రవీంద్ర సింగ్ యాదవ్ చెప్పారు. ఈ దాడిలో అయిదుగురు గార్డులు గాయపడ్డారని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. పరారైన ఖైదీలు ఎంతో దూరం వెళ్లలేరని, కరోనా పాండమిక్ కారణంగా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయన్నారు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు కర్ఫ్యూ ఉన్నట్టు ఆయన వివరించారు. 94 మంది ఖైదీలున్న ఈ జైలుకు కేవలం 10 మంది గార్డులు మాత్రమే ఉన్నారు. పారిపోయినవారిని త్వరలో పట్టుకుంటామని, వారిపై గల కేసులను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. కారం, పెప్పర్ వంటివి వీరికి ఎలా లభించాయో తెలియాల్సి ఉందన్నారు. కొంతమంది జైలు సిబ్బంది హస్తం కూడా ఉండవచ్చునని భావిస్తున్నామని, ఏమైనా ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ జైలును మరింత పటిష్టంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడానికి ఉద్యుక్తమైంది. గార్డుల సంఖ్యను పెంచడం, జైలు చుట్టూ కంచెను విస్తృతపరచడం వంటివి ఇందులో ఉన్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021