ESI లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. 53 లక్షల మందికి ప్రయోజనం

దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల ఈఎస్ఐ (ESI) లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేలా రూ.668 కోట్ల విలువైన ఏడు ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం జూలై 14న ప్రారంభించనుంది. కేంద్ర మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా తెలంగాణలోని సనత్‌నగర్ ESIC ఆసుపత్రి నుంచి ఈ ప్రాజెక్టులను ప్రారంభించనుండగా, సనత్‌నగర్‌లో కొత్త OPD బ్లాక్‌ను ప్రత్యక్షంగా, మిగతా ఆరు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

ESI లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. 53 లక్షల మందికి ప్రయోజనం
Employees State Insurance Corporation

Edited By:

Updated on: Jul 12, 2026 | 2:01 PM

దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల ESI లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఆరు రాష్ట్రాల్లో దాదాపు 668 కోట్ల విలువైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి…కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా జూలై 14న తెలంగాణలోని సనత్‌నగర్‌ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) ఆసుపత్రి నుంచి ఏడు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ESI) ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.ఇందులో సనత్‌నగర్‌లోని ESIC ఆసుపత్రి కొత్త అవుట్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) బ్లాక్‌ను స్వయంగా ప్రారంభించనుండగా, మిగిలిన ఆరు ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. ఇందులో అస్సాంలోని బెల్టోలాలో ఉన్న ఆధునీకరించిన 200 పడకల ESIC ఆసుపత్రి,తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో ఉన్న 100 పడకల ESIC ఆసుపత్రి,ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో ఉన్న ESIS ఆసుపత్రి,గుజరాత్‌లోని సురేంద్రనగర్‌లో ఉన్న ESI డిస్పెన్సరీ మరియు బ్రాంచ్ ఆఫీస్, కోటలోని ఉద్యోగ్ నగర్‌లో ఉన్న ESI డిస్పెన్సరీ , బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్‌లోని భవానీ మండిలో ఉన్న ESI డిస్పెన్సరీలు ఉన్నాయి…ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ప్రారంభోత్సవం సందర్భంగా దేశ నిర్మాణంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల పాత్రను గుర్తించి, తెలంగాణలోని సనత్‌నగర్‌లో ఉన్న ఈఎస్‌ఐసి ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ అభివృద్ధికి సహకరించిన నిర్మాణ కార్మికులను కేంద్రమంత్రి డాక్టర్ మాండవియా సత్కరించనున్నారు.. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, ఈఎస్‌ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలను పంపిణీ చేయనున్నారు.

తెలంగాణ సనత్‌నగర్ ESIC హాస్పిటల్

సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో కొత్తగా నిర్మించిన ఓపిడి బ్లాక్ సిద్ధమైంది..ఇది తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్, మెడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి , మహబూబ్‌నగర్ జిల్లాలను కవర్ చేస్తూ, 12,30,183 మంది బీమాదారులకు , లబ్ధిదారులకు ఆధునిక, సమగ్రమైన ఔట్ పేషెంట్ సేవలను అందిస్తుంది.మొత్తం రూ. 211.13 కోట్ల వ్యయంతో 43,611.04 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ సదుపాయంలో జనరల్ మెడిసిన్, ఈఎన్‌టి (ENT), డెంటిస్ట్రీ, ప్రసూతి మరియు గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, సైకియాట్రీ, డెర్మటాలజీ, పల్మనాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, ఆయుష్ విభాగాలకు ఓపిడి కాంప్లెక్స్‌లతో పాటు, ఫిజికల్ మెడిసిన్,రిహాబిలిటేషన్, రేడియాలజీ, యోగా, 180 సాధారణ పడకలు (మూడు 60-పడకల వార్డులలో), 25 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) మరియు 20 నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) పడకలు, మెడికల్ స్టోర్స్,  ఒక క్లినికల్ లెక్చర్ థియేటర్ ఉన్నాయి.ప్రస్తుతం తెలంగాణలోని మొత్తం 33 జిల్లాలలో 19,15,700 మంది బీమాదారులకు 74,32,916 మంది లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించబడింది.

ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం ESIS హాస్పిటల్

రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రి 1,31,190 మంది బీమాదారులకు, మొత్తం సుమారు 2,52,717 మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తుంది. అధిక సంఖ్యలో రోగులను నిర్వహించడానికి ఇందులో 26 ప్రత్యేక ఔట్‌పేషెంట్ విభాగ గదులు, మూడు అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు ఇతర కీలక సౌకర్యాలు ఏర్పాటయ్యాయి

అస్సాం , బెల్టోలా, ESIC ఆసుపత్రి

బెల్టోలాలోని ఈఎస్ఐసి ఆసుపత్రి అస్సాం, మేఘాలయలోని 47 జిల్లాలకు, అలాగే త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని 41 జిల్లాలకు సేవలు అందిస్తోంది. ఈ సౌకర్యం ద్వారా 3.42 లక్షల బీమాదారులకు , మొత్తం సుమారు 13.27 లక్షల మంది లబ్ధిదారులకు సేవలు అందనున్నాయి

తమిళనాడు శ్రీపెరంబుదూర్ ESIC హాస్పిటల్

భారతదేశంలోని ప్రముఖ తయారీ మరియు ఎలక్ట్రానిక్స్ కేంద్రాలలో ఒకటిగా అభివృద్ధి చెందిన శ్రీపెరుంబుదూర్‌లో 100 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో ఓపిడి, ఎమర్జెన్సీ, లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్, ఐసియు, ఐపిడి, ఎక్స్-రే ల్యాబ్ ఫార్మసీ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల నుండి 5.5 లక్షలకు పైగా బీమాదారులకు వైద్య సదుపాయాలు పొందనున్నారు

గుజరాత్ సురేంద్రనగర్ ESI డిస్పెన్సరీ, బ్రాంచ్ ఆఫీస్

సురేంద్రనగర్ జిల్లాలో ఈఎస్ఐసి పథకం కింద సుమారు 9,192 మంది బీమా చేయబడిన వ్యక్తులు ఉన్నారు. ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్ ద్వారా దాదాపు 35,000 మంది లబ్ధిదారులు ఈఎస్ఐసి యొక్క వైద్య సంరక్షణ సామాజిక భద్రతా ప్రయోజనాలను పొందగలుగుతారు. ఈ సమీకృత సదుపాయం ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు, వైద్య సంప్రదింపులు, అవసరమైన మందులు ఇతర వైద్య ప్రయోజనాలను ఒకే చోట అందిస్తుంది.

రాజస్థాన్, కోటా ,ఉద్యోగ్ నగర్ ESI డిస్పెన్సరీ , బ్రాంచ్ ఆఫీస్

కోటాలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, కోటా పారిశ్రామిక ప్రాంతంలో దాని చుట్టుపక్కల , పనిచేస్తున్న అధిక సంఖ్యలో ఉన్న బీమా కార్మికులకు వారిపై ఆధారపడిన వారికి సేవలు అందిస్తుంది. ఈ కేంద్రం తన పరిధిలోని ప్రాంతంలో 1,500 కంటే ఎక్కువ మంది యజమానులకు, సుమారు 75,000 మంది బీమాదారులకు, అలాగే వారిపై ఆధారపడిన 291,000 మందికి సేవలు అందిస్తుంది.

రాజస్థాన్ భవానీ మండి ESI డిస్పెన్సరీ

రాజస్థాన్‌లోని ప్రధాన వస్త్ర కేంద్రాలలో ఒకటైన భవానీ మండి పారిశ్రామిక క్లస్టర్‌లోని కార్మికుల కోసం ఈ సదుపాయం ఏర్పాటు చేయబడింది. ఈ ESIS డిస్పెన్సరీ స్థాపనతో, చుట్టుపక్కల ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 800 మంది యజమానులకు వీరిలో 27,715 మంది బీమా చేయబడిన వ్యక్తులు మరియు వారిపై ఆధారపడిన సుమారు 107,535 మంది కుటుంబ సభ్యులకు ఆరోగ్య సంరక్షణ సేవలు అందనున్నాయి

దేశవ్యాప్తంగా దాదాపు 3.42 కోట్ల మందికి పైగా బీమా పొందిన వ్యక్తులు ఉండగా, వారి కుటుంబ సభ్యులతో కలిపి మొత్తం 13.30 కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ESIC పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం దేశంలో 661 జిల్లాలలో సేవలందిస్తోంది… నెలకు రూ. 21,000 వరకు వేతనం తీసుకునే అసంఘటిత, సంఘటిత రంగ కార్మికులు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ESIC పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు..దేశవ్యాప్తంగా 161 ESIC ఆసుపత్రులు ఉండగా 1,574 పైగా డిస్పెన్సరీలు అందుబాటులో ఉన్నాయి. అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, ఉద్యోగంలో జరిగిన గాయాలు, మరణం వంటి సందర్భాల్లో సామాజిక భద్రత, ఉచిత వైద్య సదుపాయాలను ESIC ద్వారా కల్పిస్తారు.

Follow Us