Covishield Vaccine Price: దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. నిత్యం రెండు లక్షలకుపైగా కేసులు నమోదవుతుండగా.. రెండు వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేలా ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీల ప్రతినిధులతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడారు. అనంతరం వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు 50శాతం డోసులను నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలు, బహిరంగ మార్కెట్‌లో అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఈమేరకు భారత పార్మా దిగ్గజం పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను బుధవారం ప్రకటించింది. ఒక డోసు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.400 అని, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600లకు విక్రయిస్తామని ప్రకటించింది. రాబోయే రెండు నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పూర్తిగా పెంచుతామని పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తమ ఉత్పత్తిలో 50శాతం కేంద్రానికి, 50శాతం రాష్ట్రాలు, ప్రైవేటు ఆసుపత్రులకు అందజేయనున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక డోసుకు రూ. 400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 600 చొప్పున విక్రయించనున్నామని ప్రకటించింది. విదేశీ టీకాలతో పోలిస్తే తమ వ్యాక్సిన్ ధరలు అందుబాటులోనే ఉన్నాయంటూ సీరమ్ సంస్థ ప్రకటనలో వెల్లడించింది. అక్కడి వ్యాక్సిన్ల రేట్లను కూడా ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచి 4, 5 నెలల తర్వాత రిటైల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది.
ప్రస్తుతం కేంద్రప్రభుత్వం కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి టీకాలను నేరుగా విక్రయించి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది. అయితే ఈ విధానం వల్ల రాష్ట్రాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని మోదీ కంపెనీల ప్రతినిధులతో కూడా సంభాషించారు. వ్యాక్సిన్ కొరత రాకుండా ఉత్పత్తిని పెంచాలంటూ ఆయన పలు సూచనలు చేశారు.
Also Read: