కేంద్ర మాజీ మంత్రి, కర్నాటక మాజీ గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ కన్నుమూశారు.. గత కొద్దికాలంగా మూత్రపిండాల వ్యాధితో భాదపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే ఆదివారం గుండెపోటు రావటంతో తుదిశ్వాస విడిచారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం నిఘమ్‌బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి సహా కేరళ, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు హన్సరాజ్. 2009 నుంచి 2014 వరకు ఆయన కర్ణాటక గవర్నర్‌గా సేవలందించారు. జనవరి 2012 నుంచి మార్చి 2013 వరకు కేరళ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. కాగా, ఆయన రాజకీయ ప్రస్థానం 1982లో ప్రారంభమైంది. ఇందిరాగాంధీ ప్రోద్భలంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. రాజీవ్‌గాంధీ, పీ.వి.నరసింహారావు హయాంలో 9 ఏళ్ల పాటు లా మినిస్టర్‌గా విధులు నిర్వర్తించారు. 2009లో యూపీఏ అధికారంలోకి వచ్చాక, వీరప్ప మొయిలీకి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించిన యూపీఏ అధిష్టానం.. హన్స్‌రాజ్ భరద్వాజ్‌ను కర్ణాటక గవర్నర్‌గా నియమించింది.
హన్సరాజ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.