
అమెరికా నుంచి భారత పర్యటనకు వచ్చిన ఓ యువతి నుంచి కేవలం 400 మీటర్ల ప్రయాణానికి టాక్సీ డ్రైవర్ ఏకంగా రూ.18వేలు వసూలు చేసిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగు చూసింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సదురు యువతి ఎక్స్ వేదిగా పంచుకోగా.. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది. అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో సదురు టాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
విదేశీ యువతి చేసిన పోస్ట్ ప్రకారం.. అమెరికా నుంచి ముంబై నగరానికి చేరుకున్న తర్వాత ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్లేందుకు ఒక టాక్సీని మాట్లాడుకున్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. అయితే టాక్సీ డ్రైవర్ మొదట వారిని ఏదో తెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడని.. అక్కడ తమ నుంచి రూ.18వేలు వసూలు చేసి.. తర్వాత పక్కనే సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న ఒక హోటల్ వద్ద దించేసి వెళ్లిపోయాడని రాసుకొచ్చింది. దీంతో పాటు ఆ టాక్సీకి సంబంధించిన ఫోటోలు, వివరాలను కూడా ఆమె పోస్ట్‌లో పేర్కొంది.
అయితే ఈ పోస్ట్ కొద్ద గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కాస్తా పోలీసుల దృష్టికి చేరడంతో పోస్ట్‌లో ఉన్న వివరాల ఆధారంగా టాక్సీని కనిపెట్టిన పోలీసులు సదురు టాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై సుమోటోగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంరతం అతన్ని విచారించగా సదురు విదేశీ యువతిని అంధేరీ ఈస్ట్ ప్రాంతం చుట్టూ 20 నిమిషాల పాటు తిప్పి మళ్లీ అక్కడికే తీసుకొచ్చి పక్కనే ఉన్న హోటల్ వద్ద వదిలేసినట్టు టాక్సీ డ్రైరవ్ ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.