ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్‌కు గల అధికారాలపై పార్లమెంటు పునరాలోచించాలని సుప్రీంకోర్టు సూచించింది. స్పీకర్ కూడా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తేనన్న విషయాన్ని విస్మరించరాదని పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఒక స్వతంత్ర మెకానిజం వంటిది ఉండాలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. మణిపూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే, అటవీ శాఖ మంత్రి కూడా అయిన శ్యామ్ కుమార్‌ను సభ్యత్వానికి అనర్హునిగా ప్రకటించాలంటూ ఫజుర్ రహీం అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. నాలుగు వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది.
శ్యామ్ కుమార్ కాంగ్రెస్ టికెట్ పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.గెలుపొందారు. అయితే ఆ తరువాత బీజేపీలో చేరారు. దీంతో ఆయనను అనర్హునిగా ప్రకటించాలని కోరుతూ ఫజుర్ రహీం కోర్టుకెక్కారు. నాలుగు వారాల్లోగా మీ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో మళ్ళీ మీరు కోర్టును ఆశ్రయించవచ్ఛునని జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ ఆధ్వర్యాన గల బెంచ్.. పిటిషనర్‌కు సూచించింది.