ఎత్తులకు.. పై ఎత్తులు ఎక్కడైనా సాధారణం.. కానీ తమిళనాట అంతకు మించిన ట్విస్టులు ఉంటాయి. తాజాగా ఎడిఎంకెలో జరుగుతున్న పరిణామాలు కూడా తమిళనాడులో కాక రేపుతున్నాయి. దివంగత జయలలిత హయాంలో ఎడిఎంకె తరఫున అన్నీ తానై వ్యవహరించిన చిన్నమ్మ శశికళ జయ మరణానంతర పరిణామాలతో పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ పార్టీ కైవసం కోసం ముమ్మర ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు ప్రస్తుత పరిణామాలు చిన్నమ్మకు ప్రతికూలంగా ఉన్నా తన ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తున్నారు.. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో శశికళ భేటి తమిళ రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది.
పోయెస్ గార్డెన్‌లోని రజినీ నివాసానికి వెళ్లిన శశికళ 40 నిముషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. కాసేపటికి రజనీకాంత్‌ను ఎందుకు కలిశారో ప్రకటన విడుదల చేశారు. “రజినీ ఇటీవల అనారోగ్యంతో బాధపడ్డారు. పరామర్శ కోసం మాత్రమే ఇంటికి వెళ్లాను. ఎలాంటి రాజకీయ కోణం లేదు” అని ప్రకటనలో పేర్కొన్నారు. కానీ ఉద్దేశం అది కాదని.. అసలు వ్యూహం వేరే ఉందని వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తలైవాను సీఎం స్టాలిన్ నేరుగా వెళ్లి పరామర్శించారు. ఎడిఎంకె నుంచి ముఖ్య నేతలు ఎవరూ పరామర్శించలేదు.
ఇక ఎడిఎంకె భవిష్యత్ నాయకురాలిని నేనే అని పదే పదే చెప్పుకొంటోంది చిన్నమ్మ. ప్రయత్నాలు కూడా అదే స్థాయిలో చేస్తోంది కూడా. రజినీతో భేటీకి సంబంధించిన ప్రకటనలో శశికళ తాను అన్నాడిఎంకే చీఫ్‌గా ప్రకటించుకోవడం చర్చించాల్సిన అంశమే.. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం లేదనేది స్పష్టం అయింది. దీంతో రజినీకాంత్‌ను నేరుగా వెళ్లి కలవడం ద్వారా రాజినీ అభిమానులను ఆకర్షించడం.. రజినీతో తనకు సాన్నిహిత్యం ఉందని చెప్పడం లాంటి ప్రయోజనాల దృష్ట్యా ఈ భేటి జరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రజనీతో జరిగిన భేటీలో రాజకీయ ప్రస్తావన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎడిఎంకెలో ఏం జరగబోతోంది అని రజినీ అడగడం.. అంతా మంచే జరగబోతోంది అని శశికళ చెప్పడం.. సందర్భం వచ్చినపుడు మద్దతు కావాలని చిన్నమ్మ తలైవాను కోరడం లాంటి ఆసక్తికరమైన సంభాషణలతో భేటి సాగినట్లు సమాచారం.
డెబ్బై ఏళ్ల రజినీకాంత్ అక్టోబరు 28న అస్వస్థతతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. తరువాత ఆయనకు కరోటిడ్ ఆర్టరీ రివాస్కులరైజేషన్ చేశారు. అక్టోబర్ 31న రజినీకాంత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. గత ఏడాది డిసెంబర్ 29న, తాను రాజకీయ పార్టీని ప్రారంభించి, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కొన్ని వారాల తర్వాత, రజినీకాంత్ వెనక్కి తగ్గారు. తన అనారోగ్యం, కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు. ఆ తరువాతి తన రాజకీయ సంస్థ రజనీ మక్కల్ మండ్రం (RMM) ను రద్దు చేశారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఆయన తాజాగా నటించిన చిత్రం అన్నాత్తే ఈ ఏడాది దీపావళికి విడుదలైంది.
Former AIADMK leader VK Sasikala met with actor Rajinikanth and his wife Latha at his residence in Chennai. pic.twitter.com/8SGNT2y8M1
— ANI (@ANI) December 7, 2021
Read Also.. UP Elections: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో RLD పొత్తు ఖరారు