Mumukshu vidhi kumari: 19 ఏళ్లకే సన్యాసం పుచ్చుకున్న చదువుల తల్లి.. సన్యాసం పట్ల అమితాసక్తి కనబరుస్తోన్న యువత

|

Jan 19, 2023 | 9:38 AM

ఆడుతూపాడుతూ భవిష్యత్తును అందంగా మలుచుకోవల్సిన యువత వైరాగ్యంతో సన్యాసం బాట పడుతున్నారు. ప్రతీ యేట వందల సంఖ్యలో సన్యాసులుగా మారుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్‌కు చెందిన..

Mumukshu vidhi kumari: 19 ఏళ్లకే సన్యాసం పుచ్చుకున్న చదువుల తల్లి.. సన్యాసం పట్ల అమితాసక్తి కనబరుస్తోన్న యువత
Mumukshu Vidhi Kumari
Follow us on

ఆడుతూపాడుతూ భవిష్యత్తును అందంగా మలుచుకోవల్సిన యువత వైరాగ్యంతో సన్యాసం బాట పడుతున్నారు. ప్రతీ యేట వందల సంఖ్యలో సన్యాసులుగా మారుతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్‌కు చెందిన 19 ఏళ్ల యువతి బుధవారం (జనవరి 18) సన్యాసం పుచ్చుకుంది. హోస్పేటకు చెందిన వ్యాపారవేత్త దివంగత కాంతిలాల్, రేఖాదేవి దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరి మూడో కుమార్తె ముముక్షు విధి కుమారి. ఎంతో ప్రతిభావంతులైన ముముక్షు SSLC పరీక్షలో 100 శాతం మార్కులతో స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. ఆ తర్వాత పీయూసీలో 94.8 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందింది. చదువులో ఇంతటి ప్రతిభకనబరుస్తున్న ముముక్షు చిన్న తనం నుంచే జైన సన్యాస జీవితంపై అమితాసక్తి కనబరిచేది. క్రమక్రమంలో ఆమెకు సన్యాసం స్వీకరించాలనే కోరిక బలంగా కలిగింది. హోస్పేట్‌లోని ఓ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆదినాథ్ జైన శ్వేతాంబర ముని ఆచార్య భగవంతం నరరత్న సూరీశ్వర్జీ మహారాజు సమక్షంలో విధి కుమారి సన్యాసం స్వీకరించారు.

దీక్షలో భాగంగా నగరంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌, మాజీ ఎమ్మెల్యే హెచ్‌ఆర్‌ గవియప్ప, కాంగ్రెస్‌ నేత ఇమాజ్‌ నియాజీ, బీజేపీ నేత సిద్ధార్థ్‌సింగ్‌తోపాటు వేలాది మంది పాల్గొన్నారు. కాగా ప్రతీ యేట దాదాపు 300లకు పైగా యువత జైన సన్యాసం స్వీకరిస్తున్నారు. ఈ విధంగా జైన సన్యాసం పుచ్చుకున్న యువత భిక్షతో మాత్రమే కడుపు నింపుకుంటూ.. ప్రాపంచిక సౌఖ్యాలకు దూరంగా ఆథ్యాత్మిక జీవనం సాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా జైన సన్యాసులుగా మారే యువతలో అధికమంది సంపన్న కుటుంబాలకు చెందిన వారు కావడం కొసమెరుపు. జనవరి 18 (బుధవారం) గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమార్తె దేవాన్షి తొమ్మిదేళ్లకే సన్యాసం స్వీకరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.