బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ పై రేప్ కేసు నమోదయింది. అతడు తనపై అత్యాచారం చేశాడని, తనను మోసగించాడని ఆరోపిస్తూ 38 ఏళ్ళ మహిళ చేసిన ఫిర్యాదుతో ఓషివారా పోలీసులు అతనిపై కేసు పెట్టారు. 2015 నుంచి 2018 వరకు తాము రిలేషన్ షిప్ లో ఉన్నామని, తనను పెళ్లి చేసుకుంటానని మహాక్షయ్ వాగ్దానం చేశాడని బాధితురాలు తన కంప్లయింట్ లో తెలిపింది. 2015 లో మహాక్షయ్ అంధేరీ వెస్ట్ లో ఫ్లాట్ కొన్నాడని, అది చూడడానికి వెళ్లిన తనకు మత్తుమందు కలిపిన సాఫ్ట్ డ్రింక్ ఇచ్చి అత్యాచారం చేశాడని ఆమె పేర్కొంది. అతని వల్ల గర్భవతినయ్యానని, పెళ్లి చేసుకోవాలని కోరగా అందుకు నిరాకరించడమే గాక అబార్షన్ చేయించుకోవలసిందిగా పిల్స్ ఇచ్చాడని ఆమె వెల్లడించింది. దీంతో పోలీసులు అతనిపై రేప్, ఛీటింగ్ తదితర అభియోగాలపై కేసు నమోదు చేశారు. అంతకు ముందు కూడా బాధితురాలు మహాక్షయ్ పైన, అతని తల్లి యోగితా బాలి పైన కూడా బెగుంపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తల్లీ కొడుకులు తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది.