Rajinikanth: గవర్నర్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్‌‌..? భగవంతుడి చేతుల్లో ఉందంటూ సోదరుడి స్పందన.. మోడీ సర్కార్ డిసైడ్ అయ్యిందా..

Rajinikanth as Governor: త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ పొలిటికల్ కెరీర్‌పై మరోసారి ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. గ‌తంలో పార్టీ ఏర్పాటుపై, ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై మీన‌మీషాలు లెక్కించి.. త‌మిళ ప్రజ‌ల దృష్టిలో కొంత అభాసుపాల‌య్యారు ర‌జ‌నీ. అభిమానుల‌తో కూడా స‌మావేశాలు నిర్వహించి చివ‌ర‌కు ఉసూర‌మ‌నిపించారు. రాజ‌కీయాల్లోకి తాను రావ‌డం లేద‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ చేసేది కూడా లేద‌ని తేల్చిచెప్పారు.

Rajinikanth: గవర్నర్‌గా సూపర్‌స్టార్ రజనీకాంత్‌‌..? భగవంతుడి చేతుల్లో ఉందంటూ సోదరుడి స్పందన.. మోడీ సర్కార్ డిసైడ్ అయ్యిందా..
Rajinikanth

Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 04, 2023 | 7:42 PM

Rajinikanth as Governor: త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ పొలిటికల్ కెరీర్‌పై మరోసారి ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. గ‌తంలో పార్టీ ఏర్పాటుపై, ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై మీన‌మీషాలు లెక్కించి.. త‌మిళ ప్రజ‌ల దృష్టిలో కొంత అభాసుపాల‌య్యారు ర‌జ‌నీ. అభిమానుల‌తో కూడా స‌మావేశాలు నిర్వహించి చివ‌ర‌కు ఉసూర‌మ‌నిపించారు. రాజ‌కీయాల్లోకి తాను రావ‌డం లేద‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ చేసేది కూడా లేద‌ని తేల్చిచెప్పారు. ఇందుకు అనారోగ్య కార‌ణాల‌ను సాకుగా చూపిన రజనీ.. త‌మిళ‌నాడులో గ‌త అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నిక‌ల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ఇక ఆయన పొలిటికల్ సినిమాకు శుభం కార్డు పడిందనే అనుకున్నారంతా.. కానీ తాజాగా వస్తున్న ఊహాగానాలు ఆయన రాజకీయ జీవితంపై మళ్లీ అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఆయనకు గవర్నర్ పదవిని బీజేపీ ఆఫర్ చేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇటీవల వరుసగా ఆయన రాజకీయా నేతల్ని కలుస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆ తర్వాత జార్ఖండ్ గవర్నర్ సీపీ రాథాకృష్ణ తర్వాత తమిళనాడు గవర్నర్‌లతో భేటి అయ్యారు. ఈ వరుస సమావేశాలకు కారణం ఆయన పరోక్ష రాజకీయ రంగ ప్రవేశమేనన్నది ఇప్పుడు తమిళనాట రాజకీయాల్లో నలుగుతున్న హాట్ టాపిక్.

నిజానికి బీజేపీతో మొదట్నుంచి రజనీకాంత్‌కు మంచి మిత్రత్వం ఉంది. గతంలో చాలా సార్లు రజనీకాంత్‌ను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కమలనాథులు విశ్వ ప్రయత్నాలు చేశారు. గ‌తంలో చెన్నై వ‌చ్చిన‌ప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ర‌జినీకాంత్ ఇంటికి వెళ్లారు. కొన్ని గంట‌ల పాటు అక్కడ గ‌డిపారు. కానీ అవేవీ ఫలించలేదు. ఆయనే స్వయంగా పార్టీ పెట్టి తమిళనాడు రాజకీయాలను ఒక ఊపు ఊపేద్దామనుకున్నప్పటికీ.. సవాలక్ష కారణాల వల్ల అది సూపర్ స్టార్ వల్ల కాలేకపోయింది. ఇప్పటికే తమిళనాట బీజేపీకి అన్నాడీఎంకేతో మిత్రత్వం ఉంది. పనిలో పనిగా సూపర్ స్టార్ కూడా తమ పక్షాన ఉంటే.. దక్షిణాదిలో తమిళనాట ఘనంగా అడుగుపెడదామనుకుంది. కానీ అవేవీ సాధ్యం కాలేదు. సో… నేరుగా రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రప్పించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో.. పరోక్షంగా గవర్నర్ పదవి పేరిట ఆయన్ను తమ వాణ్ణి చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్టు సమాచారం. అందుకే ఈ గవర్నర్ గిరీ లీకులు.. మీడియాలో వరుస కథనాలు.

అయితే రజీనీకాంత్ అనుకుంటే తమిళనాట మరో ఎంజీఆర్, మరో జయలలితలా రాష్ట్రంపై ఏకఛత్రాధిపత్యం సాధించి ఉండేవారు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో ఆయన వెనుకడుగు వెయ్యడంతో ఆ ఛాన్స్ మిస్సయ్యింది. ఆ తర్వాత ఆయనంతట ఆయనే ప్రత్యక్ష రాజకీయాల విషయంలో సన్యాసం స్వీకరించి.. పూర్తిగా తన దృష్టంతా సినిమాలపైనే పెట్టారు. అయితే అక్కడ కూడా వరుస పరాజయాలు ఆయన్ను ఓ రకంగా సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేశాయి.

అయితే ఎన్ని ఫెయిలూర్స్ ఎదురైనా ఒక్క సక్కెస్‌తో వాటన్నింటినీ పక్కకు నెట్టేసే సత్తా ఈ సూపర్ స్టార్‌ది. అందుకే ఒక్క జైలర్ సినిమాతో ఆయన కెరీర్లోలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్‌తో రికార్డ్ సృష్టించారు. సరిగ్గా ఇదే పాజిటివ్ వాతావరణాన్ని వాడుకోవడం ద్వారా సక్సెస్ కావచ్చన్నది బీజేపీ ప్లాన్‌గా తెలుస్తోంది. ఆయన మళ్లీ ఫాంలోకి రావడం… అదే సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన రాలేనని ముందే తేల్చయడంతో ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ గవర్నర్ పదవి. ఈ పదవినివ్వడం ద్వారా అటు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానన్న రజనీ మాట నిజం అవుతుంది. అదే సమయంలో ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వడం ద్వారా ఆయన అభిమానుల్ని సంతృప్తి పరచినట్టవుతుంది. ఫలితంగా రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈ సానుకూల వాతావరణాన్ని ఎంతో కొంత ఉపయోగించుకున్నట్టూ అవుతుందన్నది కమలనాథుల ఎత్తుగడ అని తెలుస్తోంది.

ఇప్పటికే విఖ్యాత సంగీత ద‌ర్శకుడు ఇళ‌య‌రాజాను ఇటీవ‌ల రాజ్యస‌భ‌కు నామినేట్ చేసి తమిళనాట తన పొలిటికల్ వ్యూహానికి మరింత పదును పెట్టింది. అయితే ఇళయరాజా లాంటి మ్యూజిక్ మాస్ట్రోకి రాజ్యసభ పదవినివ్వడం వల్ల ఓ సానుకూల వాతావరణం ఏర్పడుతుందేమో కానీ…. ఆశించినంత స్థాయిలో ఓట్లు వస్తాయన్న నమ్మకం అయితే ఎవ్వరికీ లేదు. అదే మరి కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్న ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్‌ను తమ వైపు రప్పించుకుంటే.. అది కచ్చితంగా ఓట్లుగా మారుతుంది. బహుశా ఈ ఆలోచనే బీజేపీ పెద్దల్ని ఈ దిశగా ఆలోచించేలా చేసి ఉండవచ్చంటున్నారు రాజకీయ నిపుణులు.

వీడియో చూడండి..

తమిళనాట ఊపందుకుంటున్న ఈ ప్రచారంపై రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణ స్పందించారు. రజనీకి గవర్నర్‌ పదవి అన్నది ఆ భగవంతుడి చేతుల్లో ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల మధురైలో మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత సత్యానారాయణ మీడియాతో ఈ విషయం చెప్పారు. గవర్నర్‌ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామన్నారు సత్యన్నారాయణ. గవర్నర్‌ పదవి ఆఫర్‌ చేస్తే రజనీ తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడని తెలిపారు.

సో… అది సంగతి.. ఇప్పటి వరకు నేరుగా బీజేపీ గవర్నర్ పదవి ఇస్తానని చెప్పలేదు.. అదే సమయంలో రజనీకాంత్ కూడా ఇస్తే తీసుకుంటానని నేరుగా చెప్పలేదు. కానీ నడవాల్సిన ఊహాగానాలు రాష్ట్రమంతా నడుస్తున్నాయి.. జరగాల్సిన ప్రచారమూ జరిగిపోతోంది… పరోక్షంగా ఇస్తే ఓకే అన్న సంకేతాలు అందుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే… సూపర్ స్టార్ పొలిటికల్ ల్యాండింగ్‌కి… నూటికి నూరు శాతం అనుకూల వాతావరణం ఏర్పడుతున్నట్టే కనిపిస్తోంది. ఇక మొదలు కావాల్సింది కౌంట్ డౌన్… ఆ తర్వాత సేఫ్ ల్యాండింగ్… చూద్దాం.. మరి కొద్ది రోజుల్లో ఏం జరగనుందో..?

మరిన్ని జాతీయ వార్తల కోసం..