తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. భజన్‌లాల్ శర్మతో పాటు, దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రులుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా నియమితులయ్యారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పటి నుంచి ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ మొదలైంది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బంపర్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఈ ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం తర్వాత ఈ ఉత్కంఠకు పూర్తిగా తెరపడింది.
గత మంగళవారం జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో భారతీయ జనతా పార్టీ భజన్‌లాల్ శర్మను ముఖ్యమంత్రిగా, దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలను డిప్యూటీ సీఎంలుగా ఎన్నుకున్నారు. శుక్రవారం ప్రమాణస్వీకారంతో వారి లాంఛనాలు పూర్తయి రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి అయిన భజనలాల్ శర్మ సంగనేరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దియా కుమారి డిప్యూటీ సీఎం కాగా, ప్రేమ్ చంద్ బైర్వా డూడూ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఈసారి, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పేరు లేకుండానే బరిలోకి దిగింది. బీజేపీ కేంద్ర నాయకత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ధీమాతో ఎన్నికల్లో పోటీ చేసింది. బీజేపీ ఎన్నికల్లో బంపర్ విజయం సాధించింది. 199 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 69 స్థానాలకే పరిమితమైంది. అప్పటి నుంచి రాష్ట్రంలోని ప్రముఖుల నుంచి ఒకరిని ముఖ్యమంత్రిగా బీజేపీ నియమిస్తుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, అనుహ్యంగా కొత్త వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది బీజేపీ అధిష్టానం. కాగా రాజస్థాన్‌లో 33 సంవత్సరాల తరువాత, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, వసుంధర రాజే, కేంద్ర మంత్రులు, రాజ్‌నాథ్ సింగ్, గజేంద్రసింగ్ షెకావత్, పలువురు బీజేపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాజకీయాల్లో విరోధులుగా భావించే కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లు పక్కపక్కనే కూర్చోవడం విశేషం.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…