
రాజస్థాన్‌లో ఉగ్రవాద సంబంధాల అనుమానాలపై యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) కీలక చర్య చేపట్టింది. సవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బబిత ధాకడ్ అనే మహిళను అరెస్ట్ చేసింది. మిలిటరీ ఇంటెలిజెన్స్ అందించిన సమాచారంతో ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. అనుమానిత యువతిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తులో భాగంగా బబిత సోషల్ మీడియా ద్వారా జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన హ్యాండ్లర్లతో సంబంధాలు కొనసాగించినట్లు గుర్తించినట్లు సమాచారం. ఆన్‌లైన్ ద్వారా తీవ్రవాద భావజాలానికి ఆకర్షితురాలై, క్రమంగా బ్రెయిన్‌వాష్‌కు గురైనట్లు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. పోలీసుల వివరాల ప్రకారం, బబిత ఆన్‌లైన్‌లో కల్మా పఠించి ఇస్లాం మతంలోకి మారినట్లు గుర్తించారు. మత మార్పిడి అనంతరం ఆమె తన పేరును “ఖదీజా”గా మార్చుకున్నట్లు విచారణలో తేలింది. అలాగే పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లు, ఆ దిశగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
జైపూర్‌లో ఆమె స్లీపర్ సెల్‌గా పనిచేసి ఉండొచ్చనే కోణంలో ఏటీఎస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఖాతాలు, కమ్యూనికేషన్ వివరాలను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఆమెకు స్థానికంగా లేదా విదేశాల్లో మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కేంద్ర భద్రతా సంస్థలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం బబిత ధాకడ్‌ను ఏటీఎస్ కస్టడీలో ఉంచి విచారిస్తున్నారు. ఆమె ద్వారా మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లో భద్రతా వర్గాలను అప్రమత్తం చేసింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..