Rajasthan Assembly Elections Exit Poll Results 2023: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. రాజస్థాన్ లో మొత్తం ఎమ్మెల్యే సీట్లు 199. గెలుపు కోసం దాటాల్సిన మేజిక్ ఫిగర్ 100. ఇక్కడ 1993 నుంచి అధికార మార్పిడి జరుగుతూ వస్తోంది. ఒకసారి బీజేపీకి, మరోసారి కాంగ్రెస్‌కు ఛాన్స్ ఇస్తున్న రాజస్థాన్ ఓటరు.. ఈసారి కూడా అదే ట్రెడిషన్‌ని కంటిన్యూ చేస్తారా.. లేదా.. అనేది సస్పెన్స్. 2018లో బొటాబొటీ మెజారిటీతో నెగ్గిన కాంగ్రెస్ పార్టీకి.. ఈసారి కూడా ఎదురీత తప్పేలా లేదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్.
పోల్‌స్ట్రాట్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 39.9 శాతం ఓట్లతో 90 నుంచి 100 సీట్లు గెలుచుకోబోతోంది. బీజేపీ అంతకుమించి 41.8 శాతం ఓట్‌షేర్‌తో 100 నుంచి 110 సీట్లలో గెలవబోతోంది. సో.. రాజస్థాన్‌లో టైట్ ఫైట్ తప్పదన్నది పోల్‌స్ట్రాట్ తేల్చిన లెక్క. అటు.. 18.3 శాతం ఓట్లతో 5 నుంచి 15 సీట్లు నెగ్గబోతున్న ఇతరులు.. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కాబోతున్నారు. 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 13 మంది ఇండిపెండెంట్లు, ఆరుగురు బీఎస్‌పీ అభ్యర్థులు గెలిచి అసెంబ్లీకొచ్చారు.
దైనిక్ భాస్కర్ సర్వే ప్రకారం బీజేపీకి గరిష్టంగా 105 సీట్లు వచ్చే ఛాన్సుంది. పి.మార్క్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్.. బీజేపీకి 105 నుంచి 125 సీట్లు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ నంబర్ 91 దగ్గరే ఆగిపోతుందట. టైమ్స్‌నౌ-ETG సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వే కూడా బీజేపీకి 128 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 56 నుంచి 72 సీట్లు రాబోతున్నట్టు ప్రకటించింది. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ మాత్రం.. కాంగ్రెస్ పార్టీకి బెటర్ ప్లేస్ ఇచ్చింది. బీజేపీ కంటే ఆరు సీట్లు ఎక్కువగా గెల్చుకుని అధికారం చేజిక్కించుకోబోతోందట కాంగ్రెస్ పార్టీ.
2018 ఎన్నికల్లో వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు చూపాయి. ఫలితానికి దగ్గరగా వచ్చాయి. ఈసారి మాత్రం బీజేపీకే ఎడ్జ్ వస్తుందన్న సంకేతాలిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్. ప్రస్తుతం కాంగ్రెస్ తరఫున సీఎం సీట్లో ఉన్న అశోక్ గెహ్లాట్… సీఎం రేసులో ఆయనతో సమాంతరంగా పోటీ పడుతున్న సచిన్ పైలట్… ఎన్నికల్లో కసిగా పోరాడారు. కానీ.. ఈసారి సీఎం సీటును కమలం పార్టీ ఎగరేసుకుపోతుందా.. ఎప్పటిలాగే రాజస్థాన్‌లో ప్రభుత్వ మార్పిడి తప్పదా..? మొత్తానికి డిసెంబర్ 3న వచ్చే రాజస్థాన్ అంతిమతీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..