ముంబైలో టెన్షన్ వాతావరణం నెలకొంది. కోహినూర్ మిల్లు భూమి కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజ్ ఠాక్రే ఈడీ విచారణకు హాజరయ్యారు. కొహినూర్ మిల్లు భూ లావాదేవీలపై ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ ఎదుట రాజ్ ఠాక్రే హాజరైన నేపథ్యంలో.. ఎమ్మెన్నెస్ కార్యకర్తల కదలికలను దృష్టిలో పెట్టుకుని ముంబైలోని 12 జోన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్‌పాండేతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమను అదుపులోకి తీసుకుని ప్రభుత్వం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నాయకుడు సంతోష్ ధుని ఆరోపించారు.
ఇదిలా ఉంటే, కోహినూర్ మిల్లు భూముల కొనుగోలు విషయంలో రాజ్ ఠాక్రేకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పరోక్ష మద్దతు తెలిపారు. రాజ్ ఠాక్రేను ఈడీ ప్రశ్నించినా ఒరిగేదేమి లేదని ఆయన అన్నారు.