Mumbai Rains: ముంబైని ముంచెత్తిన వర్షాలు.. చెరువలను తలపిస్తున్న నగర వీధులు, రహదారులు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన జిల్లాల్లోని రహదారులు, వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటి ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా ముంబై ఎయిర్‌పోర్టుల కొన్ని విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి.

Mumbai Rains: ముంబైని ముంచెత్తిన వర్షాలు.. చెరువలను తలపిస్తున్న నగర వీధులు, రహదారులు
Mumbai Rains

Updated on: May 26, 2025 | 1:30 PM

దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతో రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంబై నగరం మొత్తం తడిసిముద్దైంది. ముంబైలోని ప్రధాన ప్రాంతాలైన కుర్లా, సియోన్, దాదర్, పరేల్‌లోని అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లోని వీధులు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే సహాయక చర్యలను స్టార్ట్ చేసింది. అయితే, రాబోయే గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవైనా కార్యక్రమాలు ఉంటే వాటిని వాయిదా వేసుకోవాలని సూచించింది.

అయితే, ముంబైలోని నారిమన్ పాయింట్ ప్రాంతంలో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య 40 మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ అధికారులు తెలిపారు. గ్రాంట్ రోడ్‌లో 36 మి.మీ, కొలాబాలో 31 మి.మీ, బైకుల్లాలో 21 మి.మీ వర్షపాతం నమోదైనట్టు స్పష్టం చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రైల్వే ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైల్వే సర్వీసులు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా ముంబైకి ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమానాల సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు తెలిపారు.

మరోవైపు మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్ సోమవారం ఉదయం బారామతిలోని వర్ష ప్రభావిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే కూడా అన్ని భద్రతా సంస్థలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

అయితే దాదాపు 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా మహారాష్ట్రలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణశాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలుకు ఇవి విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..