Delhi Rains: ఢిల్లీలో వరుణుడి బీభత్సం.. చెట్టుకూలి ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి!

దేశ రాజధాని ఢిల్లీలో వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నజాఫ్‌గఢ్‌ ప్రాంతంలో ఓ భారీ చెట్టు కూలడంతో నలుగురు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ప్రమాదంలో తల్లి సహా ముగ్గురు పిల్లలు మరణించగా..తండ్రి మాత్రం గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది.

Delhi Rains: ఢిల్లీలో వరుణుడి బీభత్సం.. చెట్టుకూలి ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి!
Delhi Rains

Updated on: May 02, 2025 | 11:27 AM

దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్‌ స్థంభాలు నేలకొరిగాయి. నజాఫ్‌గఢ్‌ ప్రాంతంలో ఓ భారీ చెట్టు కూలడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ప్రమాదంలో తల్లి జ్యోతి సహా ముగ్గురు పిల్లలు మరణించగా..తండ్రి మాత్రం గాయాలతో బయటపడినట్టు తెలుస్తోంది. ఇక నగరంలోని ద్వారక, ఖాన్‌పూర్, మింటో రోడ్, లజ్‌పత్ నగర్, సౌత్ ఎక్స్‌టెన్షన్ రింగ్ రోడ్, మోతీ బాగ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయంగా మారాయి. దీంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరి కొన్ని ప్రాంతాల్లో రేకుల షెడ్లతో నిర్మించుకున్న ఇంటిపైకప్పులు భారీ గాలులకు ఎగిరిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగి రహదారులకు అడ్డుపడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్థంభాలు కూలిపోవడంతో విద్యుత్‌ వ్యవస్థకు కూడా అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది.

ఇక భారీ వర్షాలతో విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇందిరాగాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్టులోకి భారీగా వర్షం నీరు చేరడంతో.. సుమారు 100కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో అత్యవసర ప్రయాణాలు చేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఢిల్లీలో వాతావరణం అనుకూలించక పోవడంతో ఢిల్లీకి రావాల్సిన పలు విమానాలను అధికారులు దారి మళ్లించినట్టు తెలుస్తోంది.

ఇక దేశ రాజధానిలో భారీ వర్షాల పట్ల భారత వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రెడ్‌ అలర్ట్ జారీ చేసింది. శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా ఉత్తర భారత దేశంలో పలు రాష్ట్రాలో కూడా వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…