
Jagannath Temple Wealth Telugu: ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ శ్రీ జగన్నాథ ఆలయం అపారమైన ఆస్తులు, భారీ ఆర్థిక వనరులతో దేశంలోని అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా నిలుస్తోంది. జగన్నాథ స్వామివారి పేరిట దేశవ్యాప్తంగా వివిధ జాతీయ బ్యాంకుల్లో ఏకంగా రూ.1,912 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నట్లు శ్రీ జగన్నాథ ఆలయ పాలనా విభాగం వెల్లడించింది. ఆలయానికి చెందిన మొత్తం డిపాజిట్లలో రూ.1,811 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా, మరో రూ.100.71 కోట్లు సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో రూ.500 కోట్లు ఒడిశా ప్రభుత్వం అందించిన కార్పస్ ఫండ్ అని పేర్కొన్నారు.
కేవలం నగదు నిల్వలే కాదు.. జగన్నాథ స్వామివారి పేరిట భారీ స్థాయిలో భూములు కూడా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆలయానికి సుమారు 60,821 ఎకరాల భూమి ఉన్నట్లు సమాచారం. ఇందులో అత్యధికంగా 60,426 ఎకరాలు ఒడిశా రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇక పూరీ జగన్నాథ ఆలయానికి చెందిన ప్రసిద్ధ రత్నభండార్‌లో విలువైన బంగారు, వజ్రాభరణాలు భద్రపరిచి ఉన్నాయి. ఆలయ ఆస్తుల్లో ఇవి కూడా కీలక భాగంగా ఉన్నాయి.
పూరీ జగన్నాథ ఆలయానికి భక్తులు సమర్పించే కానుకలతో పాటు పలు మార్గాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. ఆలయం పేరిట ఉన్న క్వారీలు, గనుల నుంచి వచ్చే ఆదాయం, బ్యాంకు డిపాజిట్లపై లభించే వడ్డీ, ప్రభుత్వ గ్రాంట్లు, భూముల విక్రయాల ద్వారా వచ్చే నిధులు ఆలయ ఆదాయ వనరుల్లో భాగమని పాలనా విభాగం తెలిపింది.
ఈ ఆదాయంలో కొంత మొత్తాన్ని భవిష్యత్ అవసరాల కోసం కార్పస్ ఫండ్‌గా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతామని అధికారులు వెల్లడించారు. మరికొంత మొత్తాన్ని ఫౌండేషన్ ఫండ్‌గా జమ చేస్తామని తెలిపారు. మిగిలిన నిధులను ఆలయ రోజువారీ నిర్వహణ, ఇతర అవసరాల కోసం వినియోగించే ఆలయ నిధిలో ఉంచుతారు.
పూరీ జగన్నాథ ఆలయానికి వచ్చే హుండీ విరాళాలను ప్రతిరోజూ లెక్కిస్తుంటారు. ఈ వివరాలను ఎప్పటికప్పుడు భక్తులకు అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే భక్తులు సులభంగా విరాళాలు అందించేందుకు ‘పూరీ ఆలయం సమర్పణ్’ పేరుతో ప్రత్యేక డిజిటల్ డొనేషన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల్లో ఉన్న భక్తులు ఈ వేదిక ద్వారా జగన్నాథ స్వామివారికి తమ వంతు విరాళాలను సమర్పించే అవకాశం కల్పించారు.
అపారమైన ఆస్తులు, వేల కోట్ల రూపాయల డిపాజిట్లు, విస్తారమైన భూములు, విలువైన రత్నాభరణాలతో పూరీ శ్రీ జగన్నాథ ఆలయం దేశంలోని అత్యంత సంపన్న, చారిత్రక ప్రాధాన్యం కలిగిన దేవాలయాల్లో ఒకటిగా ప్రత్యేక గుర్తింపు పొందుతోంది.