జలంధర్, అక్టోబర్ 2: పంజాబ్‌లోని జలంధర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాటలు కూడా సరిగ్గారాని ముగ్గురు చిన్నారులను కిరాతకంగా హతమర్చారు దుండగులు. అదృశ్యమైన ముగ్గురు అక్కాచెల్లెళ్లు వారి ఇంట్లోనే ఓ ట్రింకు పెట్టెలో విగత జీవులుగా పడి ఉన్నారు. ఎవరు చేశారో.. ఎందుకు చేశారో.. తెలియక పోవడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
జలంధర జిల్లాలో పనికోసం వలస వచ్చిన దంపతులకు ఐదుగురు సంతానం. తల్లిదండ్రులు ఆదివారం (అక్టోబర్ 1) పనికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి తమ ముగ్గురు కుమార్తెలు కనబడకుండా పోయారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన ఆ భార్యాభర్తలు మక్సుదాన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రోజు (సోమవారం) చిన్నారుల తండ్రి ఇంట్లోని వస్తువులు వేరే చోటికి తరలిస్తున్న క్రమంలో వారి ఇంట్లోని ట్రంకు పెట్టె సాధారణం కన్నా అధిక బరువు ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే దాన్ని తెరిచి చూడగా కనపడకుండా పోయిన తమ ముగ్గురు చిన్నారులు ఆ పెట్టెలో విగత జీవులుగా పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యాడు. మృతి చెందిన చిన్నారులను కాంచన (4), శక్తి (7), అమృత (9)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
కాగా మృతి చెందిన చిన్నారుల తండ్రికి మద్యం తాగే అలవాటు ఉండటంతో ఇంటిని ఖాళీ చేయాలని ఇటీవలే ఇంటి యజమాని ఆదేశించాడు. ఈ క్రమంలో చిన్నారులు కనిపించకుండా పోవడం అనుమానాలకు తావిస్తోంది. అదృశ్యమైన చిన్నారులు వారి ఇంట్లోనే పెట్టెలో విగతజీవులుగా కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ముగ్గురు బిడ్డలను ఒకేసారి పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల రోదన ప్రతి ఒక్కరినీ కలచి వేసింది. చిన్నారులు మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేగానీ ఈ మరణాలకు గల అసలు కారణాలు తెలియరావని పోలీసులు మీడియాకు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.