Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం.. నడుస్తూనే ప్రాణాలు కోల్పోయిన ఎంపీ..

|

Jan 14, 2023 | 10:36 AM

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. నడుస్తూనే ప్రాణాలు కోల్పోయారు పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ చౌదరీ సంతోఖ్ సింగ్. రాహుల్ గాంధీ వెంట నడుస్తూనే..

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం.. నడుస్తూనే ప్రాణాలు కోల్పోయిన ఎంపీ..
Mp Santokh Singh
Follow us on

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. పాదయాత్రలో నడుస్తూ ప్రాణాలు కోల్పోయారు పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ చౌదరీ సంతోఖ్ సింగ్. రాహుల్ గాంధీ వెంట నడుస్తూ అస్వస్థకు గురైన ఆయన.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే స్పందించిన రాహుల్ గాంధీ.. ఆంబులెన్స్‌ని పిలిపించి ఆస్పత్రికి తరలించారు. కానీ, సంతోఖ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గుండెపోటు కారణంగా ఎంపీ సంతోఖ్ చనిపోయినట్లు నిర్ధారించారు వైద్యులు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పంజాబ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా జలంధర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ చౌదరి సంతోఖ్ సింగ్.. రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ వెంట నడుస్తుండగా.. ఒక్కసారిగా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. దాంతో ఆయన అస్వస్థతకు గురై.. కింద పడిపోయాడు. వెంటనే సంతోఖ్ ని ఫగ్వారాలోని విర్క్ ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఎంపీ మృతి విషయం తెలుసుకున్న రాహుల్ గాంధీ.. వెంటనే తన పాదయాత్రను నిలిపివేసి ఆస్పత్రికి బయలుదేరారు.

ఇవి కూడా చదవండి

ఎంపీ సంతోఖ్ మృతి పట్ల కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ సంతోఖ్ సింగ్ అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని, సంతోఖ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు మల్లిఖార్జున ఖర్గే.

కాంగ్రెస్ ఎంపీ మృతి పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంతాపం తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ తనను తీవ్రంగా కలచివేసిందన్నారు.

కాగా, పంజాబ్‌కు చెందిన సంతోఖ్ సింగ్.. జూన్ 18, 1946న జన్మించారు. సంతోఖ్ జన్మస్థలం దాలివాల్. ఆయన జలందర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎన్నికయ్యారు.

నడుస్తూనే కుప్పకూలిన ఎంపీ..


మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..