AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పుణ్యభూమి అయోధ్యలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఇదే..!

అయోధ్యక్షేత్రంలో బాలరాముడి తొలి దర్శన భాగ్యాన్ని పొందబోతున్నారు. తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందుకున్న 8వేల మందిలో అత్యంత ప్రముఖులు వందమందికి పైనే. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు.

PM Modi: పుణ్యభూమి అయోధ్యలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్ ఇదే..!
Pm Modi Ayodhya Schedule
Balaraju Goud
|

Updated on: Jan 21, 2024 | 9:15 PM

Share

పవిత్ర అయోధ్యనగరి ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. హిందూ సంస్కృతి.. రామాయణం గొప్పదనం.. రాముడి వైశిష్ట్యం చాటేలా…. భక్తుల ఆశలకు.. ఆకాంక్షలకు అనుగుణంగా.. అత్యద్భుత నిర్మాణ శైలితో.. అయోధ్య రామాలయం ప్రపంచాన్ని అబ్బురపరుస్తోంది. శ్రీరాముడు జన్మించిన పుణ్యభూమి అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. సోమవారం మధ్యాహ్నం 12.05 గంటలకు బాలరామచంద్రుడి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం జరగనుంది.

వెయ్యేళ్ల కల సాకారమయ్యే సుదినం.. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. కనులారా చూడాలన్నది భక్తకోటికున్న ఆశ.. కానీ.. అందరికీ అది సాధ్యమవుతుందా? అందుకే, భక్తజనాన్ని జల్లెడ పట్టి పారిశ్రామిక దిగ్గజాలు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు.. ఇలా దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లోని అతిరథ మహారధులందరికీ ఆహ్వానాలు వెళ్లాయి. వీళ్లంతా ఒక్కచోట చేరి.. అయోధ్యక్షేత్రంలో బాలరాముడి తొలి దర్శన భాగ్యాన్ని పొందబోతున్నారు. తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందుకున్న 8వేల మందిలో అత్యంత ప్రముఖులు వందమందికి పైనే. ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్త జనం సాక్షిగా ఆగమ శాస్త్ర పద్ధతుల్లో బలరాముడికి ప్రతిష్ఠించనున్నారు. రామ మందిర శంకుస్థాపనలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అయోధ్యకు వెళ్లనున్నారు.

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 10.25 గంటలకు అయోధ్యలోని కొత్త మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలిప్యాడ్‌ ద్వారా ఉదయం 10.55 గంటలకు రామయ్య ఆలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక మధ్యాహ్నం 12.05 గంటలకు ప్రాణప్రతిష్ఠ పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం 12.55 గంటల వరకు కొనసాగనుంది.

రామ మందిర ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రధాని మోదీ బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులతో మమేకమయ్యే బహిరంగ కార్యక్రమంలోనే ఉంటారు. ఇక మధ్యాహ్నం 2.10 గంటలకు కుబేర్ తిలా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దాంతో ప్రధాని షెడ్యూల్ పూర్తవుతుంది.

కాగా, ప్రాణ ప్రతిష్ఠ కోసం ప్రధాని 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అనుష్ఠాన్ సమయంలో వివిధ ఆచారాలను ప్రధాని ఆచరిస్తున్నారు. ప్రత్యేక ఆచారం జనవరి 12న ప్రారంభమైంది. ఇందుకోసం ప్రధాని నేలపైనే నిద్రిస్తూ.. కేవలం కొబ్బరి నీళ్లనే ఆహారంగా తీసుకుంటున్నారు.

ఇదిలావుంటే 2019, నవంబర్ 9న అప్పటి చీఫ్‌ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం రామజన్మభూమి వివాదంపై చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. అయోధ్య దివ్యమందిర నిర్మాణానికి అదే అసలైన అంకురార్పణ. ఈ అత్యున్నత ధర్మాసనంలో ప్రస్తుత సీజేఐ డీవై చంద్రచూడ్, మాజీ సీజేఐ ఎస్ఏ బాబ్డే, ప్రస్తుత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ న్యాయమూర్తి అశోక్ భూషణ్ ఉన్నారు. ఈ ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులకు అయోధ్య నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. మరో 100 మందికి పైగా మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు సైతం ప్రాణప్రతిష్టలో పాల్గొంటారు.

ఈ క్రమంలోనే బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం దిగ్గజాలందరూ అయోధ్యకు దారితీశారు. అనేక రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు, ప్రతిపక్ష నేతలు సైతం.. అయోధ్య మందిరం ఆవరణలో ఆశీనులు కాబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాత మర్యాద పురుషోత్తముడి దర్శనం చేసుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…