Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన పార్టీ.. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు మద్ధతు ఇస్తామని ప్రకటించడంపై విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా స్పందించారు. ముర్ముకు మద్ధతు ఇవ్వాల్సిందిగా ఉద్ధవ్ ఠాక్రేని బలవంతం చేశారని ఆరోపించారు. తాజాగా గౌహతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్డీయే ప్రభుత్వం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు ఈడీ, సీబీఐ, ఐటీ శాఖ, గవర్నర్ కార్యాలయం వంటి ఏజెన్సీలను ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వాలను పడగొట్టడానికి దుర్వినియోగం చేస్తున్నారంటూ సిన్హా ఫైర్ అయ్యారు. ‘‘ఒక పార్టీ, ఒక పాలకుడు అజెండాతో ప్రజాస్వామ్య భారతదేశాన్ని కమ్యూనిస్ట్ చైనాకు అనుకరణగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.’’ అని సంచలన ఆరోపణలు చేశారు సిన్హా.
ఎన్‌డిఎ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు వివేలకరులతో మాట్లకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. వ్యక్తిగతంగా ముర్ము అంటే అపార గౌరవం ఉందన్న సిన్హా.. రాజ్యాంగ నిబద్ధతను కూడా పరిగణనలోకి తీసుకుంటానని అన్నారు.
ఇదిలాఉంటే.. గత నెలలో జరిగిన విపక్షాల సమావేశానికి హాజరైన థాక్రే.. తొలుత సిన్హాకు మద్ధతు ప్రకటించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు.. శివసేన అధినేత మనసు మార్చుకునేలా చేసింది. శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 16 మంది ఎంపీలు ఎన్డీయే అభ్యర్థి ముర్ముకు మద్ధతు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారు. లేదంటే బీజేపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దాంతో ఉద్ధవ్ థాక్రే వెనక్కి తగ్గారు. ఇప్పటికే 40 మందికిపైగా ఎమ్మెల్యేలు జారుకోవడంతో అధికారం కోల్పోయిన ఉద్ధవ్.. నేడు ఎంపీలను కూడా కోల్పోవద్దనే అభిప్రాయంతో ముర్ముకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో ప్రతిపక్షాలు షాక్ అయ్యాయి.