Prashant Kishore: పీకే వ్యూహం పని చేస్తుందా.. గెలిచేదెవరు ఓడేదెవరు..

|

Mar 27, 2022 | 7:17 AM

ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore). ఎన్నికల వ్యూహకర్త, కూటములు.. గెలుపు, ఓటములు.. లెక్కలు, తీసివేతలు.. కలిసి వచ్చే అంశాలు, నష్టపరిచే విషయాలు చెప్పడంలో దిట్ట. పెద్ద పెద్ద రాజకీయ నేతలకూ ఓటమి నుంచి గెలుపు రుచిని...

Prashant Kishore: పీకే వ్యూహం పని చేస్తుందా.. గెలిచేదెవరు ఓడేదెవరు..
Prashant Kishore
Follow us on

ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore). ఎన్నికల వ్యూహకర్త, కూటములు.. గెలుపు, ఓటములు.. లెక్కలు, తీసివేతలు.. కలిసి వచ్చే అంశాలు, నష్టపరిచే విషయాలు చెప్పడంలో దిట్ట. పెద్ద పెద్ద రాజకీయ నేతలకూ ఓటమి నుంచి గెలుపు రుచిని పరిచయం చేసిన వ్యక్తి. లాభమే కాదు. కొన్ని సార్లు పీకే వల్ల నష్టపోయిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. అసలు ఎవరీ పీకే. ఎక్కడ నుంచి వచ్చారు. గతంలో ఏం చేశారు. ఆయన చెప్పే సూత్రాలు ఎంత వరకు పని చేశాయి. తనకు ఏడేళ్లుగా పీకే తెలుసు. ఆయన సలహాలు సూచనలు పని కొస్తాయని ఇటీవల తెలంగాణ(Telangana) సీఎం కేసీఆర్ సైతం చెప్పారంటేనే అతని సమర్థత ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్(KCR) నే కాదు.. జగన్, మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రివాల్, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్ వంటి వారు ఎందుకు అంతగా రాజకీయ నేతలు ఆయన పేరు కలవరిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

బిహార్ లోని కిషోర్ రోహ్తాస్ జిల్లాలోని కోనార్ ప్రాంతం ప్రశాంత కిషోర్ సొంతూరు. తండ్రి శ్రీకాంత్ పాండే వైద్యుడు. శ్రీకాంత్ వృత్తి రీత్యా బీహార్ లోని బక్సార్ లో నివాసం ఉండేవారు. ఈ క్రమంలో పీకే బక్సార్ లోనే రాజకీయ పాఠాలు చదువుకున్నారు. అక్కడ నుంచి ఎదిగిన పీకే భారత ప్రధాన వ్యూహకర్తలలో ఒకరిగా మారారు. రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో సేవలందించారు. 2013 లో సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సీఏజీ) ను స్థాపించారు. కిషోర్‌కు చెందిన సీఏజీ ఎన్నికల ప్రచార బృందం బాగానే పని చేసింది. కష్టమైన ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలో శిక్షణ ఇవ్వడానికి కసరత్తు చేసింది. అందుకే మోదీకి కరణ్ థాపర్‌తో బ్రేక్ ఆఫ్ ఇంటర్వ్యూను 30 సార్లు చూపించారట.

2012లో గుజరాత్ లో మోడీ మూడో సారి సీఎం అయ్యేందుకు తన వంతు సలహాలు, సూచనలు పని చేశాయి. 2014 లోక్ సభ ఎన్నికలలో మోడీ నేతృత్వంలోని బీజేపీ మెజారిటీకి తన వంతు సహకారం అందించాడు ప్రశాంత్ కిషోర్. 2014 మే లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సన్నాహకంగా మీడియా ప్రచార సంస్థ ఏర్పాటు చేశాడు. మోదీతో చాయ్ పే చర్చా కార్యక్రమం. త్రీడి ర్యాలీలు, రన్ ఫర్ యూనిటీ, మంథన్ సోషల్ మీడియా ప్రోగ్రామ్‌లు, వినూత్న మార్కెటింగ్ అండ్ యాడ్స్ ప్రచారం వంటివి చేయించారు. మోదీ బృందాన్ని నడిపించిన వ్యూహాల్లో కిషోర్ కీలకమైన వ్యక్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. విషయం ఏదైనా ఆ తర్వాత మోదీ టీమ్ కు దూరంగా జరిగారు.

నితీష్ తో పొసగక…

2018 సెప్టెంబరు 16 న జనతాదళ్ (యునైటెడ్) పార్టీలో చేరారు పీకే. నితీష్ కుమార్ కు చేదోడు వాదోడుగా నిలిచారు. కానీ పౌరసత్వ సవరణ చట్టం (2019) పై పార్టీ అధినేత నితీష్ కుమార్ తీరును తప్పు పట్టడం కలకలం రేపింది. అంతే 2020 జనవరి 29 న పార్టీ నుండి పీకేను బహిష్కరించారు నితీష్ కుమార్. నిరాశ చెందకుండా తొలిగా పీపుల్స్ హెల్త్ లో శిక్షణ పొందిన కిషోర్ ఆ తర్వాత వెనుక్కు తిరిగి చూసుకోలేదు. ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ రెండింటికీ ఎన్నికల వ్యూహకర్తగా సేవలందించిన ఘనత పీకేకే దక్కింది. మోదీతో విడిపోయాక (సీఏజీ) ను స్పెషలిస్ట్ పాలసీ సంస్థ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ తన ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంది.

ఏపీలో జగన్ కు…

2017 మేలో పీకేను తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్న జగన్ ఆయన వ్యూహాం ప్రకారమే పని చేశారు. ముందుగానే పీకేకు చెందిన ఐ పాక్ సంస్థ వైసీపీకి సలహాదారుగా పని చేసింది. జగన్ పాదయాత్ర డిజైన్ చేసింది కూడా ఆ సంస్థనే. సమర శంఖారావం, అన్న పిలుపు, ప్రజా సంకల్ప యాత్ర అనే ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నద్దం చేసింది. ఫలితంగా ఏపీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయభేరి మోగించేందుకు దోహదం చేశారు. అదే సమయంలో తెలంగాణలో టీఆర్ఎస్ కు సహయ, సహకారాలు అందించారు పీకే. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పై గురి పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. అంతే ప్రశాంత్ కిషోర్ టీమ్ అక్కడ అడుగు పెట్టింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. ఆప్ విజయానికి పీకే ప్లాన్ చేసింది.

బిహార్ లో నితీశ్ కు..

2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో అమరీందర్ సింగ్ కోసం కాంగ్రెస్ పీకేను రంగంలోకి దింపింది. విజయం సాధించింది. అలానే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడి (యు) -ఆర్జేడీ-కాంగ్రెస్ ల మహాఘట్ బంధన్ కోసం వ్యూహాలు రూపొందించారు పీకే. ఆ కూటమిని విచ్చిన్నం చేసే వ్యూహ రచన చేసింది పీకేనే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఎలో తిరిగి నితీష్ చేరడంతో ప్రశాంత్ కిషోర్ జేడీయూలో చేరారు. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఠాక్రేల వారసుడు ఆదిత్య థాకరే సంప్రదింపులు జరిపి సలహాలు తీసుకుంది. మహారాష్ట్రలో శరద్ యాదవ్ సైతం పీకేను ఆహ్వానించడం విశేషం. ఆదిత్య థాకరే ప్రచార కార్యక్రమాలను ప్రశాంత్ కిషోర్ డిజైన్ చేశారు. ఆదిత్య ఠాక్రే జన్ ఆశీర్వాద్ యాత్రను ప్రశాంత్ కిషోర్ టీం రూపకల్పన చేసింది.

ఘోర పరాజయం..

2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ సాయం కోరింది సమాజ్ వాదీ పార్టీ. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఓటమి పాలైంది. మొత్తం 403 సీట్లలో కాంగ్రెస్ కు వచ్చింగి కేవలం ఏడు సీట్లే. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఏకంగా 300 పైచిలుకు సీట్లు వచ్చాయి. ప్రశాంత కిషోర్ వ్యూహాలు పని చేయేలుదు. అంతే కాదు 2019 లోక్‌సభ ఎన్నికలు బీఎస్పీ, ఎస్పీ పొత్తు పెట్టుకున్నాయి. ఒక్క సీట్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ రాహుల్ గాంధీ అమేథిలో ఓటమి పాలవడం మాములు విషయం కాదు.

బెంగాల్ లో మెరుపులు..

పశ్చిమ బెంగాల్‌లో బిజెపితో అమీ తుమీకి మమతా సిద్దమైంది. ఈ సమయంలో దీదీకి సహకరించారు ప్రశాంత్ కిషోర్. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ పని చేశారు. ఆ ఎన్నికల్లో టీఎంసీ గెలుపునకు కృషి చేశారు. తమిళనాడులో కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మైయం (ఎంఎన్‌ఎం), అన్నాడీఎంకే తోను చర్చలు జరిపినా ముందుకెళ్లలేదు. చివరకు డీఎంకేకు సాయం కోరండంతో అటువైపు వెళ్లారు పీకే. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి వచ్చేందుకు పీకే వ్యూహాలు పని చేశాయి. కమల్ హాసన్, రజినీకాంత్ ల మధ్య సయోధ్యకు పీకే యత్నాలు చేయడం మాములు విషయం కాదు. కమల్ హాసన్ తో బంధం మధ్యలోనే ముగిసినా.. స్టాలిన్ తో సత్సంబంధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణలో కేసీఆర్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నాడు పీకే. తనకు ఏడేళ్లుగా పీకే సలహాలు ఇస్తున్నారని సీఎం కేసీఆర్ బాహాటంగానే చెప్పారు.

పిల్లి మెడలో గంట…

మమతా బెనర్జీ, స్టాలిన్‌ విజయం తరువాత మూడో ప్రత్యామ్నాయంపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కొత్త ఫ్రంట్‌కు ముందడుగుగా ఢిల్లీలో శరద్‌ పవార్‌ నివాసంలో 8 పార్టీల నేతలతో భేటీ అయ్యారు పీకే. పిల్లి మెడలో ఎవరు గంట కట్టాలి అనే సామెతలా ప్రశాంత్‌ కిశోర్‌ వారందరినీ ఒక తాటిమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలను సమన్వయం చేసే బాధ్యత నెత్తికెత్తుకున్నట్లు తెలుస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దూకుడు పెంచారు ప్రశాంత్‌ కిశోర్‌. బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో గెలిచినా అది 2024 ఎన్నికల నాటికి ఉండదని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు పీకే. పశ్చిమబెంగాల్‌, తమిళనాడులలో మమత, స్టాలిన్ విజయాలకు వ్యూహకర్తగా ఉన్నారు ప్రశాంత్‌ కిశోర్‌.

కానీ కొత్త కూటమిలో కాంగ్రెస్‌ ఉండటంపై పలు పార్టీలు అభ్యంతరం చెప్పడంతో వారిని ఒప్పించే పని చేస్తున్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంకలతో జులై13, 2021న ఢిల్లీలో ప్రశాంత్‌ కిశోర్‌ భేటీ అయి వాస్తవాలను వారికి చెప్పే ప్రయత్నం చేశారు పీకే. కాంగ్రెస్‌-మూడో కూటమి ప్రధాని అభ్యర్ధి పేరు ప్రకటించకుండానే ముందుకు సాగాలనే వ్యూహంతో ముందుకు సాగాలనే ఆలోచన నడుస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సాధించాల్సిన సీట్ల విషయంలో లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నాయి. లోక్‌ సభలో 542 సీట్లకుగాను మెజార్టీకి కావాల్సిన కనీస సీట్ల సంఖ్య 273. ఇందులో కాంగ్రెస్‌ కనీసం 136 సీట్లు సాధించగలిగితే, మిగిలిన బీజేపీయేతర పార్టీలు 137 స్థానాలు సాధించే లక్ష్యాన్ని వారు ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలోను..

తెలంగాణలో సీఎం కేసీఆర్ కు సలహాలిస్తున్నాడు పీకే. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సహకారం అందిస్తుండటం హాట్ టాపికైంది. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలు పచ్చగడ్డి వేయకముందే మండుతున్నట్లు మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఆ రెండు పార్టీలకు వ్యూహకర్తగా ఉంటూ ఎలా ముందుకు తీసుకెళతాడనే చర్చ సాగుతోంది. మరోవైపు తెలంగాణ స్థాయిలో పీకే శిష్యుడు నవీన్ రంగంలోకి దిగడం రాజకీయ వేడిని పెంచుతోంది. కాంగ్రెస్ కు రాష్ట్ర స్థాయిలో నవీన్ ఉంటే జాతీయ స్థాయిలో పీకే ఉంటాడనే వాదన జరుగుతోంది. పీకే ఎలాంటి ప్లాన్ గీసినా దక్షిణాది రాష్ట్రాల్లోనే కాదు.. తిరిగి దేశంలోను మేమే అధికారంలోకి వస్తామంటోంది బీజేపీ. మోదీ, షా, యోగి త్రయం ఉండగా మరొకరు గెలవలేరంటోంది. ఎవరికి వారే ఎత్తులకు పై ఎత్తులు పొత్తులతో వెళుతున్న వేళ రాజకీయ యవనిక పై ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.

             – కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్ట్

                              – రీసెర్చ్ ప్రొడ్యూసర్, టీవీ9 తెలుగు.