Delhi Red Fort incident: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు.. ఆ ఘటనకు సంబంధించి తాజాగా దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 124ఏ ప్రకారం కేసు నమోదు చేసిన దర్యాప్తు వేగవంతంగా జరుపుతున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజాబీ నటుడు దీప్ సిద్ధూ, గ్యాంగ్‌స్టర్ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన లఖాసిధానాలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో భాగంగా ఘజీపూర్ సరిహద్దు నుంచి బయలుదేరిన ఆందోళనకారులు ఆదాయపు పన్ను కార్యాలయ కూడలికి చేరుకుని పోలీసులతో ఘర్షణకు దిగారు. అనంతరం పోలీసుల నుంచి ఛేదించుకొన్న ఆందోళనకారులు ఎర్రకోటకు చేరుకుని అక్కడ జెండా ఎగురవేశారు. హింసాత్మక ఘటనలతో పాటు ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం.. వీటి దర్యాప్తుపై ఢిల్లీ పోలీసులకు పలు సూచనలు చేసింది. తాజాగా ఈ ఘటనపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో హింసాత్మక ఘటనకు కారణమైనందున న్యాయపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ దాదాపు 20 రైతు సంఘాల నాయకులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారు. వీటిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు.