
PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీ డిసెంబర్ 30న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.17,500 కోట్ల విలువైన 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నట్లు మంగళవారం ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. 23 ప్రాజెక్టుల్లో రూ.14,100 కోట్లకుపైగా విలువైన 17 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల, రోడ్లు, గృహాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అనేక రంగాలకు ఉపయోగపడనున్నాయి. బహుళ రహదారి విస్తరణ ప్రాజెక్టులు, పితోర్‌ఘర్‌లో జల విద్యుత్ ప్రాజెక్టు, నైనిటాల్‌లో మురుగు నీటి నెట్‌వర్క్‌ను మెరుగు పర్చడానికి ప్రాజెక్టులతో సహా 6 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరగనుంది. ప్రారంభించే ప్రాజెక్టుల వ్యయం రూ.3400 కోట్లకుపైగా ఉంటుందని పీఎంఓ తెలిపింది.
దాదాపు రూ.5750 కోట్లతో నిర్మించనున్న లఖ్వార్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు మొదట 1976లో నిర్మాణం కోసం ప్రణాళికలు చేయగా, చాలా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాజెక్టు సుమారు 34,000 హెక్టార్ల భూమికి సాగునీరు, 300 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ ఆరు రాష్ట్రాలకు తాగునీరు సరఫరా చేస్తుంది.
అయితే దేశంలో సుదూర ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగు పర్చాలనే ఉద్దేశంతో ప్రధాని మంత్రి ఈ ప్రారంభోత్సవంలు, శంకుస్థాపనలు చేపడుతున్నారు. రూ. 4000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 85 కిలోమీటర్ల మొరాదాబాద్-కాశీపూర్ నాలుగు లైన్ల రహదారికి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రాష్ట్ర వ్యాప్తంగా రహదారి నిర్మాణ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.625 కోట్లకుపైగా వ్యయంతో మొత్తం 1157 కిలోమీటర్ల పొడవునా 133 గ్రామీణ రహదారులకు శంకుస్థాపన చేయడం, దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో 151 వంతెనల నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.
ఉత్తరాఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటి సరఫరాను మెరుగుపర్చడానికి జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 73 నీటి సరఫరా పథకాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకాలకు మొత్తం రూ.1250 కోట్లు ఖర్చు చేయనున్నారు. హరిద్వార్, నైనిటాల్ పట్టణ ప్రాంతాలలో నాణ్యమైన నీటి సరఫరా అయ్యేలా ప్రధాని ఈ రెండు నగరాలకు నీటి సరఫరా పథకాలకు శంకుస్థాపన చేస్తారు. ఇలా ప్రధాని మోడీ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి: