PM Modi: వాజ్‌పేయి జన్మదిన కానుక.. నదుల అనుసంధానానికి మోదీ శ్రీకారం..!

| Edited By: Balaraju Goud

Dec 25, 2024 | 10:09 AM

మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంా మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో కెన్-బెత్వా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశం జాతీయ నదుల అనుసంధాన విధానంలో చేపట్టబోయే మొదటి ప్రాజెక్ట్. దీంతో కరువు పీడిత బుందేల్‌ఖండ్ ప్రాంతంలో నీటిపారుదల, జలవిద్యుత్‌ను పెంచుతుందని భావిస్తున్నారు.

PM Modi: వాజ్‌పేయి జన్మదిన కానుక.. నదుల అనుసంధానానికి మోదీ శ్రీకారం..!
Pm Modi On Rivers Interling
Follow us on

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జన్మదినం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దేశవ్యాప్తంగా నీటి వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ నీటి కొరతను తీర్చే బృహత్తర కార్యక్రమం ‘నదుల అనుసంధానం’లో భాగమైన కెన్-బెత్వా రివర్ ఇంటర్‌లింకింగ్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్, వాజ్‌పేయి స్మారకార్థం ప్రత్యేక స్టాంపు, నాణెం విడుదల వంటి కార్యక్రమాలను కూడా మోదీ చేపట్టనున్నారు.

దేశవ్యాప్తంగా నదుల్లో నీటి లభ్యత వినియోగంలో తీవ్ర వ్యత్యాసాలున్నాయి. కొన్ని నదుల్లో నీటి లభ్యత తక్కువ ఉండి, దానిపై ఆధారపడే ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉంటున్నారు. కొన్ని నదుల్లో నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే ఏకైక మార్గం నదుల అనుసంధానమేనని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పలు సందర్భాల్లో చెప్పారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో దీనిపై సమగ్ర అధ్యయనం కూడా చేయించారు. ఆయన కలలుగన్న ఈ ప్రాజెక్టును నిజం చేసేందుకు నేటి ప్రధాని మోదీ నడుం బిగించారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:10 గంటలకు ఖజురహో చేరుకుని కెన్-బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టు శంకుస్థాపనతో పాటు పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గం. 2:20 గంటలకు ఢిల్లీకి బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కూడా హాజరుకానున్నారు.

సాగునీరు – తాగునీరు

కెన్-బెత్వా నదులను అనుసంధానించడం ద్వారా మధ్యప్రదేశ్ రాష్ట్రం విస్తృతంగా ప్రయోజనం పొందనుంది. కెన్-బెట్వా లింక్ నేషనల్ ప్రాజెక్ట్ భూగర్భ పీడన పైప్డ్ ఇరిగేషన్ సిస్టమ్‌ను అవలంబిస్తున్న దేశంలో అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ద్వారా మధ్యప్రదేశ్‌లోని 10 జిల్లాలు (ఛతర్‌పూర్, పన్నా, తికమ్‌గఢ్, నివారి, దామోహ్, శివపురి, దాతియా, రైసెన్, విదిషా, సాగర్‌)లోని 8 లక్షల 11 వేల హెక్టార్లకు సాగునీటి సదుపాయం లభిస్తుంది. మొత్తం 44 లక్షల మంది రైతు కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే.. పంటల ఉత్పత్తి పెరిగి రైతుల ఆదాయంలో పెరుగుదల గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టు ద్వారా 103 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయవచ్చు. అదే స్థాయిలో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. మెరుగైన నీటి నిర్వహణ, పారిశ్రామిక యూనిట్లకు తగినంత నీటి సరఫరా పారిశ్రామిక అభివృద్ధికి దారి తీస్తుంది.

ఈ ప్రాజెక్ట్‌తో ఉత్తరప్రదేశ్‌లో 59 వేల హెక్టార్లకు ఏడాది పొడవునా నీటిని అందించవచ్చు. మొత్తం 1.92 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఇప్పటికే ఉన్న నీటిపారుదల వ్యవస్థ స్థిరీకరించవచ్చు. ఈ నదుల అనుసంధానం కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని మహోబా, ఝాన్సీ, లలిత్‌పూర్ మరియు బందా జిల్లాల్లో నీటిపారుదల సదుపాయాలు మరింత మెరుగుపడతాయి. కేవలం సాగునీటి అవసరాలకు మాత్రమే కాదు, మధ్యప్రదేశ్‌లోని 44 లక్షల జనాభాకు మరియు ఉత్తరప్రదేశ్‌లోని 21 లక్షల జనాభాకు తాగునీటి సదుపాయాన్ని కూడా అందించడంలో ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.

ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్

వాజ్‌పేయి 100వ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించే మరో కీలకమైన ప్రాజెక్టు ఓంకారేశ్వర్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని ఓంకారేశ్వర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా ఈ ఏడాది అక్టోబర్‌ నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రాజెక్ట్ యొక్క రెండవ దశ 240 MW సామర్థ్యంతో MPPACA నుండి అవసరమైన అనుమతులు పొంది డెవలపర్ “సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్”తో ఒప్పందంపై సంతకం చేయాలని ప్రతిపాదించారు. నర్మద నదిపై తేలియాడే సౌర ఫలకాల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి జరగనుంది. మరోవైపు నదిలో నీరు ఆవిరైపోయే అవకాశాలు కూడా తగ్గుతాయి.

అటల్ గ్రామ్ గుడ్ గవర్నెన్స్ భవనాల భూమి పూజ

మధ్యప్రదేశ్‌లోని 1,153 అటల్ గ్రామ్ సుశాసన్ భవన్‌లకు ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. రాష్ట్రంలోని 23 వేల గ్రామ పంచాయతీల్లో భవనాలు లేని, శిథిలావస్థకు చేరిన భవనాలు, నిరుపయోగంగా ఉన్న 2,500 గ్రామ పంచాయతీలను కొత్త భవనాల మంజూరు కోసం గుర్తించారు. తొలిదశలో 1153 కొత్త పంచాయతీ భవనాలకు రూ.437.62 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయి పంచాయతీ భవనం గ్రామ పంచాయతీకి అత్యంత ప్రాథమిక, ముఖ్యమైన మౌలిక సదుపాయంగా అభిప్రాయపడ్డారు. గ్రామ పంచాయతీల పనిబాధ్యతల ఆచరణాత్మక అమలులో ఈ భవనాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయని పేర్కొన్నారు. పంచాయతీలను బలోపేతం చేయడానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలలో కొత్త పంచాయతీ భవనాలను, క్లస్టర్ స్థాయిలో క్లస్టర్ పంచాయతీ భవనాలను ఆమోదించింది. ప్రధాని మోదీ కొన్ని గంటల వ్యవధిలో ఈ ప్రాజెక్టులను శంకుస్థాపన, భూమి పూజ, ప్రారంభోత్సవం జరిపి ఢిల్లీకి వెనుదిరగనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..