
భారతదేశంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన ఏకైక రాష్ట్రం కేరళ. రాష్ట్ర పర్యాటకం, గల్ఫ్ దేశాలలో పెరుగుతున్న కేరళీయుల జనాభా దీనికి కారణం. అయితే, జేవార్ విమానాశ్రయం ప్రారంభంతో, ఈ పోటీలో ఉత్తర ప్రదేశ్ కేరళను అధిగమించింది. ప్రస్తుతం దేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగి రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్ అవతరించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం జేవార్ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. .
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. జేవార్ విమానాశ్రయాన్ని నిజంగా ప్రారంభించేది మీరేనని ప్రజలకు చెప్పారు. “నేను కేవలం తెరను మాత్రమే తొలగించాను. ఇప్పుడు దీనిని నిజంగా ప్రారంభించేది మీరే. మీ మొబైల్ ఫోన్ లైట్లను ఆన్ చేసి దీనిని ప్రారంభించండి” అని కోరారు. ఈ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. జేవార్ ప్రాంతం ఉత్తర భారతదేశంలో ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ గ్రేటర్ ఢిల్లీ ప్రాంతాన్ని, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌ను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక నగరాలకు అనుసంధానిస్తుంది. ఇది స్విస్ సాంకేతిక నైపుణ్యం, భారతీయ ఆతిథ్యంల అద్భుతమైన సమ్మేళనాన్ని ప్రదర్శిస్తుంది.
#WATCH | Greater Noida, UP: PM Modi inaugurates Phase 1 of the Noida International Airport in Jewar today. pic.twitter.com/LLig1JPcUy
— ANI (@ANI) March 28, 2026
రైతులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మధ్యప్రాచ్య సంక్షోభాన్ని భారత్ బలంగా ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. “ప్రస్తుతం ఎక్కడ చూసినా యువతే కనిపిస్తున్నారు. ఎందుకంటే, జరుగుతున్న ఈ పని భవిష్యత్తుకు ఒక కొత్త దిశను, ఉత్థానాన్ని ఇస్తుందని యువతకు తెలుసు. ఈ రోజు మనం అభివృద్ధి చెందిన యూపీ, అభివృద్ధి చెందిన భారతదేశం ప్రచారంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము. ఉత్తర ప్రదేశ్, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉండటంతో పాటు, అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా కూడా అవతరించింది.” అని ప్రధాని అన్నారు. ఈ రోజు తనకు గర్వకారణంగా, సంతోషంగా ఉండటానికి రెండు కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మొదటిది, ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని, రెండవది, తనను తమ ప్రతినిధిగా, ఎంపీగా ఎన్నుకున్న రాష్ట్ర గుర్తింపుతో ఈ అద్భుతమైన విమానాశ్రయం ముడిపడిపోయిందని ఆయన అన్నారు.
“గత నెల రోజులుగా పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతోంది. అనేక దేశాల్లో ఆహార పదార్థాలు, పెట్రోల్, ఎరువులు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రతి దేశం ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితి వల్ల మన భారతదేశం కూడా ప్రభావితమైంది. ఈ ఘర్షణ ప్రభావిత ప్రాంతాల నుంచి భారతదేశం అధికంగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల, ఈ సంక్షోభ భారం సామాన్య ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది.” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
గత సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో నోయిడా వారి దోపిడీకి ఒక ఏటీఎంలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కానీ నేడు, బీజేపీ ప్రభుత్వ హయాంలో అదే నోయిడా ఉత్తర ప్రదేశ్ అభివృద్ధికి ఒక శక్తివంతమైన చోదక శక్తిగా మారుతోందని ఆయన తెలిపారు. 2004 నుంచి 2014 వరకు ఈ విమానాశ్రయం ఫైళ్లలోనే మరుగున పడిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆనాటి సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకుంది. అయితే, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో పనిచేస్తోందని ఆయన తెలిపారు.
మూఢనమ్మకాల కారణంగా ఒకప్పుడు నోయిడాను విడిచిపెట్టేవారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమ పదవులు కోల్పోతామనే భయంతో గత ప్రభుత్వాలు ఇక్కడికి రావడానికి కూడా భయపడేవి. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను నోయిడా పర్యటనకు ప్రణాళిక వేయగా, ముఖ్యమంత్రి ఎంతగా భయపడ్డారంటే ఆయన రాలేదన్న విమర్శించారు. “నోయిడాకు వెళ్లవద్దు, మీరు ఇప్పుడే ప్రధానమంత్రి అయ్యారు” అని నన్ను బెదిరించడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ నేను, చాలా కాలం పాటు సేవ చేసే అవకాశం ఇచ్చే ఈ నేల ఆశీర్వాదం కోరడానికి వెళ్తున్నానని, నేడు, అదే ప్రాంతం ఆత్మనిర్భర భారత్ సంకల్పానికి బలాన్నిస్తూ, యావత్ ప్రపంచాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఏ దేశంలోనైనా విమానాశ్రయాలు కేవలం ఒక సాధారణ సౌకర్యం మాత్రమే కాదని, అవి పురోగతికి కొత్త ఊపునిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2014కు ముందు దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా, నేడు వాటి సంఖ్య 160కి పైగా పెరిగింది. విమాన ప్రయాణ సౌకర్యం ఇకపై కేవలం మహానగరాలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా చిన్న నగరాలకు కూడా చేరుకుంటోంది. విమాన ప్రయాణం కేవలం ధనవంతులకే పరిమితం కావాలని గత ప్రభుత్వాలు భావించగా, బీజేపీ ప్రభుత్వం దానిని సామాన్య భారతీయులకు సులభతరం, అందుబాటులోకి తెచ్చిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విమానాశ్రయ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్న నేపథ్యంలో, శనివారం (మార్చి 28) ఉదయం పండుగ వాతావరణం నడుమ నోయిడాలోని జేవర్‌కు ప్రజలు పోటెత్తారు. కాన్పూర్ నుండి శంఖారావకులు, మహోబా నుండి డ్రమ్మర్లు, నృత్యకారులు, ఉత్తర ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుండి ట్రంపెట్ వాద్యకారులు ఆ ప్రాంగణంలోని ఉత్సవ వాతావరణానికి మరింత శోభను చేకూర్చారు. చాలా మంది జాతీయ జెండాలను చేతబట్టుకుని రాగా, మరికొందరు బీజేపీ జెండాలను కూడా ప్రదర్శించారు.
ఇక ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పటి వరకు, లక్నోలో చౌదరి చరణ్ సింగ్ విమానాశ్రయం ఉంది. వారణాసిలో లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. కుషినగర్‌లో కుషినగర్ అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఈ రోజు జేవార్ అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభోత్సవంతో, రాష్ట్రంలో ఇప్పుడు ఐదు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి.
జేవర్‌లో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయంగా నిలుస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. దీని నిర్మాణ వ్యయం రూ. 11,282 కోట్లు. ఈ భారీ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 29,560 కోట్లు. ఉత్తర భారతదేశానికి జేవర్‌ను ఒక ప్రధాన విమానయాన కేంద్రంగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. ఇది రాష్ట్ర అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకువెళుతుందని సీఎం యోగి అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..