PM Modi: వారెవ్వా.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా ప్రధాని మోదీ రికార్డు

భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేశారు. దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా కొనసాగిన నాయకుడిగా ఆదివారం కొత్త రికార్డు సృష్టించారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పావన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమిస్తూ మోదీ ఈ ఘనత సాధించారు.

PM Modi: వారెవ్వా.. అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా ప్రధాని మోదీ రికార్డు
Narendra Modi

Updated on: Mar 22, 2026 | 1:00 PM

భారత దేశ రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ మరో మైలురాయిని అధిగమించారు. ఆదివారం ఆయన దేశంలో అత్యధిక కాలం పాటు ప్రభుత్వ అధినేతగా సేవలందించిన నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించారు. ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో చేసిన సేవలు, అనంతరం ప్రధానిగా కొనసాగుతున్న పదవీకాలాన్ని కలిపి మొత్తం 8,931 రోజులు ప్రభుత్వ అధినేతగా పనిచేసిన మోదీ, చామ్లింగ్ నమోదు చేసిన 8,930 రోజుల రికార్డును దాటేశారు. ఇది దేశ చరిత్రలో కీలక ఘట్టంగా భావిస్తున్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నాయకుడిగా నిలిచిన మోదీ, ప్రధానిగా కూడా విశేష అనుభవం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన తొలి ప్రధానిగా కూడా ఆయన ప్రత్యేక స్థానం సంపాదించారు. 2014, 2019, 2024 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు తన పార్టీకి విజయం సాధింపజేసి నాయకత్వాన్ని చాటారు.

గత ఏడాది అక్టోబర్‌లో తన పాలన 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మోదీ, 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు రాష్ట్రం తీవ్రమైన పరిస్థితుల్లో ఉందని గుర్తు చేశారు. భూకంపం, తుఫాను, వరుస కరువులు, రాజకీయ అస్థిరత వంటి సవాళ్లు ఎదురైనా, వాటిని అవకాశాలుగా మలుచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపినట్టు పేర్కొన్నారు. పేదల కోసం పనిచేయడం, అవినీతి దూరంగా ఉండమంటూ తన తల్లి ఇచ్చిన సలహా ప్రజా జీవనానికి మార్గదర్శకంగా నిలిచిందని తెలిపారు. గుజరాత్‌ను కరువు ప్రభావిత రాష్ట్రం నుంచి మంచి పాలనకు ప్రతీకగా మార్చినట్లు.. వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల్లో గొప్ప పురోగతి సాధించామని చెప్పారు. 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపికైన సందర్భాన్ని గుర్తు చేసుకున్న మోదీ, ఆ సమయంలో దేశంలో విశ్వాస సంక్షోభం నెలకొన్నదని పేర్కొన్నారు. 2014లో ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుతో కొత్త దిశగా ప్రయాణం ప్రారంభమైందని అన్నారు.

గత 11 సంవత్సరాల్లో 25 కోట్లకు పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ప్రత్యేక స్థానం సంపాదించిందని తెలిపారు. మహిళా శక్తి, యువ శక్తి, రైతుల అభివృద్ధికి తీసుకున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని వివరించారు. దేశ సేవ చేయడం తనకు అత్యున్నత గౌరవమని పేర్కొన్న మోదీ, రాజ్యాంగ విలువల ఆధారంగా ‘వికసిత భారత్’ నిర్మాణానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

 

Also Read: ఎండాకాలంలో ఒంటికి చలవచేసి మనిషిని ఉక్కులా మార్చేస్తది.. పులియబెట్టి చేయాలి..

 

Follow Us