విద్యార్థుల మార్కుల జాబితా అనేది చిన్నారులకు ప్రెజర్ షీట్‌గా, తల్లిదండ్రులకు ప్రెస్టేజ్ షీట్‌గా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. NEP-2020తో ఇకపై ఆ సమస్య తొలగిపోనుందని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులపైన, వారి తల్లిదండ్రులపైన మార్కుల జాబితా ఒత్తిడి నిర్మూలనే జాతీయ నూతన విద్యావిధానం-2020 (NEP-2020) ప్రధాన లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో పాఠశాల విద్య పేరుతో కేంద్రం ఏర్పాటు చేసిన సదస్సులో మోదీ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. పాఠశాలల్లో బోధనా భాషపై కూడా ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మాతృభాషలో బోధించడంవల్ల విద్యార్థులు ఏ విషయాన్నైనా సులువుగా అర్థం చేసుకోవడంతోపాటు మరింత జ్ఞానాన్ని సంపాదించగలుగుతారన్నారు. భాష అనేది జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక సాధనమని.. భాషే జ్ఞానం కాదని అయన పేర్కొన్నారు. కేవలం బుక్ నాలెడ్జ్ కు పరిమితమైన జనం ఈ తేడాను గమనించడంలేదన్నారు. ఏ భాషలో బోధిస్తే చిన్నారులు తేలికగా గ్రహిస్తారో అదే బోధనా భాష అని ప్రధాని స్పష్టం చేశారు. జపాన్, ఐర్లాండ్, పోలాండ్, ఫిన్లాండ్, దక్షిణ కొరియా దేశాల్లో ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరుగుతున్న విషయాన్ని మోదీ గుర్తు చేశారు. అందుకే కనీసం 5వ తరగతి వరకైనా బోధన మాతృభాషలోనే ఉండాలని NEP-2020 సూచిస్తోందని మోదీ చెప్పారు. అయితే మాతృభాషలో బోధనతోపాటు, ఇంగ్లీష్ సహా ఇతర భాషలు నేర్చుకోవడంపై ఎలాంటి పరిమితులు ఉండవని మోదీ వెల్లడించారు.