దేశ ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మోదీ అధికారికంగా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక మూడోసారి ప్రధాని అయిన మోదీ తొలి సంతకం దేనిపై చేస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది.
మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జై కొట్టారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత నిధులను విడుదల చేశారు. రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన, అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దస్త్రంపై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు. ఈ ఐదేళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భగా మోదీ తెలిపారు.
కాగా పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో 9.3 కోట్ల మంది రైతులకు రెండు వేలు చొప్పున 20వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమకానున్నాయి. ఇదిలా ఉంటే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ ఈరోజు తొలి కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం ఉండనుంది. అయితే అంతలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తికానుందని తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్ధేశం చేయనున్నారు. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..