SCO సదస్సులో ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్.. ఉగ్రవాదంపై పోరాటం, మధ్య ఆసియా భాగస్వామ్యం!

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్ పర్యటనలో భాగంగా SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం ప్రాంతీయ శాంతికి ముప్పుగా నిలుస్తున్నాయని, వీటిని సమూలంగా నిర్మూలించడానికి SCO దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని మోదీ స్పష్టం చేశారు. మధ్య ఆసియాతో వాణిజ్యం, కనెక్టివిటీ, వ్యూహాత్మక సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం.

SCO సదస్సులో ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్.. ఉగ్రవాదంపై పోరాటం, మధ్య ఆసియా భాగస్వామ్యం!
Pm Modi Sco Summit

Updated on: Aug 29, 2026 | 12:46 PM

ప్రాంతీయ శాంతి, భద్రతకు ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం ప్రధాన సవాళ్లుగా మారాయని, వీటిని సమూలంగా నిర్మూలించేందుకు షాంఘై సహకార సంస్థ (SCO) సభ్య దేశాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరగనున్న 26వ SCO శిఖరాగ్ర సమావేశానికి ముందు ఆయన భారతదేశం అనుసరించనున్న రోడ్‌మ్యాప్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్‌స్థాన్‌లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌కు చేరుకోనున్నారు ప్రధాని. ఆ దేశ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు అధికారిక పర్యటన చేపట్టనున్నారు. అనంతరం కిర్గిజ్‌స్థాన్‌కు వెళ్లి SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు.

తాష్కెంట్‌లో కీలక భేటీలు..!

ఆగస్టు 29, 30 తేదీల్లో తాష్కెంట్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. భారత్, ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధనం వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. భారత్-ఉజ్బెకిస్తాన్ సంబంధాలు ఇటీవలి కాలంలో గణనీయంగా పురోగతి సాధించాయని ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న నాగరికత, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కూడా ఈ పర్యటన దోహదపడుతుందని అన్నారు.

శాస్త్రి మెమోరియల్, గాంధీ సెంటర్ సందర్శన

తాష్కెంట్ స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మా గాంధీ సెంటర్‌ను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. ఇవి భారత్-ఉజ్బెకిస్తాన్ మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

బిష్కెక్‌లో SCO శిఖరాగ్ర సమావేశం

తాష్కెంట్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్కెక్‌కు వెళ్లనున్నారు. కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు సద్యార్ జపరోవ్ ఆహ్వానం మేరకు ఆయన 26వ SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. SCO ఏర్పాటై 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. 2017లో సంస్థలో చేరిన భారత్.. అప్పటి నుంచి SCOలో చురుకైన, నిర్మాణాత్మక సభ్యదేశంగా కొనసాగుతోంది.

ఉగ్రవాదంపై భారత్‌ స్పష్టమైన వైఖరి!

SCO వేదికగా ప్రాంతీయ భద్రత, అనుసంధానం, ఆర్థిక అవకాశాలపై భారతదేశ దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ముఖ్యంగా ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదం వంటి సవాళ్లను ఎదుర్కొనే విషయంలో సభ్య దేశాల మధ్య సమన్వయం మరింత పెరగాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. భారత్ పొరుగు ప్రాంతాలతో పాటు విస్తృతంగా ఈ సవాళ్లు శాంతి, స్థిరత్వానికి ముప్పుగా కొనసాగుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి ఎలాంటి మద్దతు, ప్రోత్సాహం లేకుండా.. దానిని సమూలంగా నిర్మూలించేందుకు SCO దేశాలు కలిసి పనిచేయాలని భారత్ కోరుకుంటోందని స్పష్టం చేశారు.

మొత్తంగా ప్రధాని మోదీ పర్యటనలో మధ్య ఆసియాతో వ్యూహాత్మక సంబంధాల విస్తరణతో పాటు ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక సహకారం, వాణిజ్యం, కనెక్టివిటీ అంశాలు ప్రధానంగా నిలిచే అవకాశం ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us