PM Modi: అస్సాం గడ్డపై అద్భుతం.. 10 వేల మందితో బాగురుంబా ప్రదర్శన.. ప్రధాని మోదీ ఫిదా..

అస్సాం గడ్డపై అద్భుతమైన జానపద కళా దృశ్యం ఆవిష్కృతమైంది. గౌహతిలోని సారుసజై స్టేడియం సాక్షిగా 10 వేల మందికి పైగా బోడో కళాకారులు ఏకకాలంలో బాగురుంబా నృత్యంతో చరిత్ర సృష్టించారు. ఈ చారిత్రాత్మక ప్రదర్శనను స్వయంగా వీక్షించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బోడో సంస్కృతిని చూసి మంత్రముగ్ధులయ్యారు.

PM Modi: అస్సాం గడ్డపై అద్భుతం.. 10 వేల మందితో బాగురుంబా ప్రదర్శన.. ప్రధాని మోదీ ఫిదా..
Pm Modi

Updated on: Jan 19, 2026 | 8:33 AM

అస్సాంలో అద్భుతమైన సాంస్కృతిక దృశ్యం ఆవిష్కృతమైంది. గౌహతిలోని సారుసజై స్టేడియం వేదికగా జరిగిన బాగురుంబా దోహో 2026 ప్రదర్శన యావత్ దేశాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఈ చారిత్రాత్మక వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై, బోడో ప్రజల అద్భుతమైన కళా వైభవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 10,000 మందికి పైగా జానపద కళాకారులు ఏకకాలంలో చేసిన బాగురుంబా నృత్యం గిన్నిస్ రికార్డు స్థాయి విన్యాసంగా నిలిచింది. అద్భుతమైన లేజర్ షో, సాంప్రదాయ సంగీతం మధ్య జరిగిన ఈ ప్రదర్శనను చూసి ప్రధాని అబ్బురపడ్డారు. “ఈ అనుభవాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఉత్సాహభరితమైన బోడో సంస్కృతి దేశం అంతటా సంచలనం సృష్టించడం హృదయపూర్వకంగా ఉంది” అని ప్రధాని మోదీ కొనియాడారు.

బోడో గుర్తింపుకు పట్టాభిషేకం

ప్రసంగం ప్రారంభంలో బోడో భాషలో ప్రజలకు ‘మాఘ బిహు’ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని అందరినీ ఆకట్టుకున్నారు. బగురుంబా కేవలం ఒక నృత్యం మాత్రమే కాదని, అది బోడో సమాజ గుర్తింపుకు చిహ్నమని ప్రధాని అన్నారు. బోడో ప్రజల మనోభావాలను గౌరవిస్తూ బీజేపీ ప్రభుత్వం బథౌ పూజను అధికారికంగా గుర్తించి, రాష్ట్రంలో సెలవు దినంగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఒకప్పుడు రక్తపాతంతో ఉన్న అస్సాం, నేడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని, రాష్ట్ర వాతావరణం పూర్తిగా మారిపోయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

రాజకీయ విమర్శలు.. అస్సాంపై మమకారం

2026 అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. “గతంలో ఏ ప్రధాని కూడా అస్సాంను ఇన్నిసార్లు సందర్శించలేదు. అస్సాం కళ, సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నేను కట్టుబడి ఉన్నాను” అని స్పష్టం చేశారు. అస్సాం అభివృద్ధిలో బిజెపి ప్రభుత్వం పోషిస్తున్న పాత్రను ఆయన ఈ సందర్భంగా వివరించారు.