
భారతదేశ ఆధ్యాత్మిక రాజధాని కాశీ, దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం తమిళనాడు.. ఈ రెండింటి మధ్య ఉన్న వేల ఏళ్ల అనుబంధాన్ని పునరుజ్జీవింపజేస్తూ సాగుతున్న కాశీ-తమిళ సంగమం జాతీయ సమైక్యతకు కొత్త అర్థాన్ని ఇస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇటీవల ముగిసిన ఈ ఉత్సవాల నాల్గవ ఎడిషన్, భారతీయులందరినీ ఒకే తాటిపైకి తెస్తూ చరిత్రలో నిలిచిపోయింది. ఇటీవల సోమనాథ్‌లో జరిగిన స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారతీయుల శాశ్వత స్ఫూర్తిని కొనియాడారు. 1026లో సోమనాథ్ పై జరిగిన దాడికి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన తరుణంలో నిర్వహించిన ఈ కార్యక్రమం మన సంస్కృతిని కాపాడుకోవడంలో ప్రజల దృఢ సంకల్పాన్ని చాటిచెప్పిందని.. ఇదే ఉత్సాహం కాశీ-తమిళ సంగమంలోనూ కనిపిస్తోందని మోదీ అన్నారు.
డిసెంబర్ 2, 2025న ప్రారంభమైన నాల్గవ ఎడిషన్ ఒక ప్రత్యేక థీమ్ ద్వారా అందరినీ ఆకర్షించింది. కాగా తమిళం నేర్చుకోకపోవడం తన జీవితంలో విచారకరమైనదిగా మోదీ తెలిపారు. “తమిళ కర్కలం” పేరుతో ఉత్తరాది ప్రజలు మధురమైన తమిళ భాషను నేర్చుకునేలా ప్రోత్సహించారు. ప్రాచీన తమిళ సాహిత్య కావ్యమైన తోల్కప్పియంను 4 భారతీయ భాషల్లోకి, 6 విదేశీ భాషల్లోకి అనువదించి ప్రపంచానికి పరిచయం చేశారు. తెన్కాశి నుండి కాశీ వరకు ఋషి అగస్త్య వాహన యాత్ర నిర్వహించి, మార్గమధ్యలో ఉచిత కంటి శిబిరాలు, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. ఇది సేవా దృక్పథంతో కూడిన సాంస్కృతిక యాత్రగా నిలిచిందని మోదీ కొనియాడారు.
కాశీకి, తమిళనాడుకు ఉన్న సంబంధం నేటిది కాదని మోదీ తెలిపారు. కాశీలో బాబా విశ్వనాథ్ కొలువై ఉంటే, తమిళనాడులో రామేశ్వరుడు ఉన్నాడు. అందుకే తెన్కాశిని దక్షిణ కాశీగా పిలుస్తారు. జాతీయ కవి సుబ్రమణ్య భారతి తన మేధో వికాసానికి కాశీనే వేదికగా చేసుకున్నారు. ఇక్కడే ఆయన దేశభక్తి కవిత్వం పదును తేలింది. కుమారగురుపరార్ స్వామిగళ్ వంటి సిద్ధులు కాశీలో మఠాలను స్థాపించి శతాబ్దాల క్రితమే ఈ వారధిని నిర్మించారని ప్రదాని చెప్పారు.
సంగమ కార్యక్రమాల్లో భాషా సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం భాషిణి వంటి AI సాంకేతికతను ఉపయోగిస్తోంది. దీనివల్ల తమిళ ప్రసంగాలు హిందీ, తెలుగులోకి, హిందీ ప్రసంగాలు తమిళంలోకి తక్షణమే అనువాదమై ప్రజల మధ్య దూరాన్ని తగ్గించాయి.
ఈ అద్భుత యాత్ర రామేశ్వరంలో ముగిసిందని మోదీ అన్నారు. భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పాల్గొని ఇటువంటి వేదికలు కేవలం ప్రదర్శనలు మాత్రమే కాదని ఇవి ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ అనే మహోన్నత లక్ష్యానికి పునాదులని తెలిపారు. సంక్రాంతి, పొంగల్, మాఘ బిహు పండుగల వేళ.. ఈ సాంస్కృతిక సంగమం దేశ ప్రజల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రాబోయే కాలంలో ఈ వేదికను మరింత బలోపేతం చేసి, భారతీయ విజ్ఞాన వ్యవస్థలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సంక్రాంతి పర్వదినాన్న ఆయన గోవులకు ఆహారం తినిపించారు.