వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై బుధవారం పార్లమెంట్ లో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూప్రధాని మోదీ తన ప్రసంగాన్ని మొదట…. ఈ చట్టాలను సమర్థిస్తూ ఇవి రైతులమేలుకే నన్నారు. ఈ చట్టాలలో ప్రాధాన్యతను కాంగ్రెస్ సహా విపక్షాలు గుర్తించాలన్నారు. అన్నదాతలు తగిన సూచనలు చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ చట్టాల కారణంగా ఏ రైతయినా నష్ట పోయాడా అని ప్రశ్నించారు. నిరసన చేస్తున్న రైతులు..వదంతులకు గురైన బాధితులని ఆయన అభివర్ణించారు. వారి స్పిరిట్ ని ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన చెప్పారు. పాత మండీలపై ఆంక్షలు లేవని, ప్రస్తుతమున్న మండీల ఆధునీకరణకు కేటాయింపులు జరిపామని మోదీ తెలిపారు. వరకట్న నిషేధ చట్టం, ట్రిపుల్ తలాక్, బాల్య వివాహాల నిషేధ చట్టం వంటివాటిగురించి ఎవరూ ప్రశ్నించడం లేదని, ఇందుకు కారణం అవి సమాజ మెరుగుదల కోసమేనని ఆయన చెప్పారు. రైతులు తమకు లాభం వచ్చేచోటుకు వెళ్లి తమ పంటలు అమ్ముకోవచ్చునన్నారు.
కాగా…. ఒక సమయంలో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తన ప్రసంగానికి అడ్డు తగలడంతో మోదీ ఆగ్రహించారు. మీ ధోరణి మితి మీరుతోందని, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని, మీరెందుకు హద్దు మీరుతున్నారని ఆయన అన్నారు. అటు-మోదీ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని వారు మొదట నినాదాలు చేశారు.