
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. రాధాకృష్ణన్ అద్భుతమైన ఉపరాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సీపీ రాధాకృష్ణన్ సింపుల్ లైఫ్‌స్టైల్, ప్రజా సేవ పట్ల అంకితభావాన్ని మోదీ ప్రశంసించారు. అలాగే ఇద్దరి మధ్య ఉన్న పాత స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. వారిద్దరి మధ్య ఉన్న నాలుగు దశాబ్దాల స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ మోడీ సరదాగా మాట్లాడారు.
పార్లమెంటులో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ.. రాధాకృష్ణన్‌తో తనకు 40ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు. ‘‘మేము 40 ఏళ్లకు పైగా స్నేహితులం. అప్పుడు నా జుట్టు నల్లగా ఉండేది.. రాధాకృష్ణన్ తలపై కూడా జుట్టు ఉండేది’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆయనకు క్రీడలంటే చాలా ఆసక్తి. కానీ ఆయన ఎప్పుడూ రాజకీయ ఆడలేదు” అని అన్నారు. లోక్‌సభలో ఏర్పాటు చేసిన సెంగోల్ గురించి ప్రస్తావిస్తూ.. అది తమిళనాడు నుండి వచ్చిందని మోదీ అన్నారు. ఇప్పుడు రాజ్యసభలో అత్యున్నత పదవిలో తమిళనాడుకు చెందిన బిడ్డ కూర్చోబోతున్నారని వ్యాఖ్యానించారు. రాధాకృష్ణన్ ఒక సాధారణ, వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చి, దేశంలో అత్యున్నత పదవి వైపు పయనిస్తున్నారని ప్రధాని కొనియాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
నామినేషన్ తర్వాత ప్రధాని మోడీ తన ఎక్స్ ఖాతాలో రాధాకృష్ణన్‌ను ప్రశంసిస్తూ పోస్ట్ చేశారు. ‘‘భారత ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేసినప్పుడు నేను, మంత్రులు, పార్టీ సహచరులు ఎన్డీఏ నాయకులు సీపీ రాధాకృష్ణన్ వెంట ఉన్నాము. ఆయన అద్భుతమైన ఉపరాష్ట్రపతి అవుతారని, జాతీయ పురోగతి వైపు మన ప్రయాణాన్ని మెరుగుపరుస్తారని ఎన్డీఏ కుటుంబం నమ్మకంగా ఉంది” అని మోడీ రాసుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..