
టీవీ9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “మేము ఎవరి పక్షాన ఉంటాం? అని అడిగేవారికి మా సమాధానం ఒక్కటే.. మేము దేశ ప్రయోజనాల పక్షాన ఉంటాం” అని ఆయన స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 నుండి ప్రపంచం అల్లకల్లోలంగా ఉందని, మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణల ప్రభావం ఏ దేశంపై పడకుండా ఉండటం అసాధ్యమని ప్రధాని అన్నారు. యుద్ధాలు మన సరిహద్దులకు దూరంగా జరుగుతున్నప్పటికీ, వాటి దుష్ప్రభావాలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా భారతదేశం తన అభివృద్ధి వేగాన్ని తగ్గించలేదని ఆయన గర్వంగా ప్రకటించారు.
ప్రపంచ దేశాలు వేర్వేరు వర్గాలుగా విడిపోతుంటే, భారతదేశం మాత్రం దేశాల మధ్య అపూర్వమైన వారధులను నిర్మిస్తోందని మోదీ అన్నారు. “గ్లోబల్ సౌత్ నుంచి పొరుగు దేశాల వరకు భారత్ అందరికీ ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలిచింది. మేము కేవలం శాంతి, సంప్రదింపుల పక్షాన మాత్రమే నిలబడతాము” అని ఆయన వివరించారు.
2014 పూర్వపు నిస్తేజ స్థితిని విడిచిపెట్టి, నేడు భారత్ సరికొత్త ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతోందని ప్రధాని అన్నారు. కోవిడ్-19 మహమ్మారి నుంచి నేటి యుద్ధ వాతావరణం వరకు ప్రతి ఏటా భారతీయులు పరీక్షలను ఎదుర్కొంటూనే ఉన్నారు. 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి కృషితోనే ప్రతి విపత్తును మనం జయించగలుగుతున్నాం. యుద్ధ సమయాల్లో కూడా భారత్ అనుసరిస్తున్న వ్యూహాలు, ఆర్థిక స్థిరత్వం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం నెలకొన్న ఈ సమయంలో, కొన్ని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడంపై ప్రధాని అసహనం వ్యక్తం చేశారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదని, అత్యంత సంయమనం, సున్నితత్వంతో వ్యవహరించాల్సిన సమయమని ఆయన హితవు పలికారు.