దీపావళి రోజున యువతకు ప్రధాని మోదీ బంపర్ బహుమతి ఇవ్వనున్నారు. ఈ శనివారం (అక్టోబరు 22) ప్రధాని మోదీ 75వేల మంది యువతతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. పలు మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలకు ఎంపికైన యువతకు ఈ అపాయింట్‌మెంట్ లెటర్లను అందించనున్నారు. ధన్‌తేరస్ రోజున, 10 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాబ్ మేళాను ప్రారంభించబోతున్నారు. ఈ ఉపాధి మేళా కింద మొదటి దశలో 75 వేల మందిని నియమించనున్నారు. ఈ 75000 మందికి నియామక పత్రాలు అందజేయనున్నారు. నియమిత వ్యక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ చేస్తున్న నిరంతర నిబద్ధతను నెరవేర్చడంలో ఇదొక ముఖ్యమైన ముందడుగు కానుంది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు, అన్ని మంత్రిత్వ శాఖలు, శాఖలు మిషన్ మోడ్‌లో మంజూరైన పోస్టులు, ప్రస్తుత ఖాళీలను భర్తీ చేయడానికి కృషి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొత్త రిక్రూట్‌లు భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో చేరతారు. నియమితులైనవారు వివిధ స్థాయిలలో ప్రభుత్వంలో పాలుపంచుకుంటారు. గ్రూప్-ఎ, గ్రూప్-బి (గెజిటెడ్), గ్రూప్-బి (నాన్ గెజిటెడ్),గ్రూప్-సి వంటివి ఇందులో ఉన్నాయి.
రిక్రూట్‌మెంట్ జరుగుతున్న పోస్టులలో సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ పర్సనల్, సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్, ఎల్‌డిసి, స్టెనో, పిఎ ఇన్‌కమ్ ట్యాక్స్, టాక్స్ ఇన్‌స్పెక్టర్, ఎంటిఎస్‌లతో పాటు ఇతర విభాగాలు లేదా పోస్టులు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌లు మినిస్ట్రీలు, డిపార్ట్‌మెంట్‌లు తమ సొంతంగా లేదా యూపీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ ద్వారా మిషన్ మోడ్‌లో జరుగుతాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వంటి ఏజెన్సీల ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. వేగవంతమైన రిక్రూట్‌మెంట్ కోసం, ఎంపిక విధానాలు సరళీకృతం చేయబడ్డాయి.
దేశవ్యాప్తంగా 10లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇదే అంశంపై జూన్‌లోనే ప్రధాని నరేంద్ర మోడీ అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలలో మానవ వనరులను సమీక్షించారు. కొన్ని నెలల్లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే ప్లాన్‌తో ముందుకు కదులుతున్నారు. దీనితో పాటు వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రభుత్వం మిషన్ పద్ధతిలో పనిచేయాలని ఆదేశించారు.
గత ఏడాది, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా, మార్చి 1, 2020 నాటికి కేంద్ర ప్రభుత్వ శాఖలలో 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఈ సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరి ఉంటుందని భావిస్తున్నారు. వారిని రిక్రూట్ చేయడానికి PM ఈ చొరవ తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో మొత్తం 40 లక్షల 4 వేల పోస్టులు ఉన్నాయని, వాటిలో దాదాపు 31 లక్షల 32 వేల మంది ఉద్యోగులను నియమించుకున్నారని జితేంద్ర సింగ్ చెప్పారు. అంటే 8.72 లక్షల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం